ఏపీలో విభిన్న వాతావరణం.. పలు జిల్లాలకు పిడుగుల హెచ్చరిక

ఆంధ్రప్రదేశ్‌లో రానున్న మూడు రోజుల పాటు విభిన్న వాతావరణ పరిస్థితులు నెలకొననున్నాయని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ (ఏపీఎస్‌డీఎంఏ) వెల్లడించింది. ఒకవైపు ఎండల తీవ్రత కొనసాగుతుండగానే, మరోవైపు ఆకాశం మేఘావృతమై వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. రాష్ట్రంపై ఏర్పడిన ద్రోణి, నైరుతి దిశ నుంచి వీస్తున్న గాలుల ప్రభావంతో ఈ మార్పులు చోటుచేసుకుంటున్నాయని పేర్కొంది. 

విపత్తుల సంస్థ అంచనా ప్రకారం.. సోమవారం ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాల్లో పలుచోట్ల పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. వీటితో పాటు అల్లూరి సీతారామరాజు, పోలవరం, విశాఖ, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పు, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి జల్లులు పడొచ్చని తెలిపింది. 

ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. ఆకస్మిక వర్షాల సమయంలో పిడుగుపాటు ప్రమాదం పొంచి ఉందని, వర్షం పడేటప్పుడు సురక్షిత ప్రాంతాల్లో ఆశ్రయం పొందాలని సూచించింది. ముఖ్యంగా చెట్ల కింద నిలబడటం అత్యంత ప్రమాదకరమని స్పష్టం చేసింది. రైతులు, కూలీలు, పశువుల కాపరులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరింది.


More Telugu News