Putta Mahesh: డ్రగ్స్ ఎఫెక్ట్: ఎంపీ పుట్టా మహేశ్ కు టీడీపీ షోకాజ్ నోటీసు

TDP Issues Show Cause Notice to MP Putta Mahesh Over Drugs Allegations
తెలుగుదేశం పార్టీకి చెందిన ఏలూరు పార్లమెంటు సభ్యుడు పుట్టా మహేశ్ పై పార్టీ అధిష్ఠానం క్రమశిక్షణా చర్యలకు ఉపక్రమించింది. హైదరాబాద్ శివార్లలోని మొయినాబాద్ ఫాంహౌస్‌లో జరిగిన పార్టీలో ఆయన మత్తుపదార్థాలు తీసుకున్నారన్న అంశం నేపథ్యంలో, పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని ఆదేశించింది. ఈ వ్యవహారంపై ఐదు రోజుల్లోగా లిఖితపూర్వక వివరణ ఇవ్వాలని స్పష్టం చేస్తూ షోకాజ్ నోటీసు జారీ చేసింది.

ఈ మేరకు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు ఆదివారం పుట్టా మహేశ్ కు అధికారికంగా నోటీసు పంపారు. మార్చి 14వ తేదీన మోయినాబాద్ ఫాంహౌస్‌లో జరిగిన ఘటన, ఆ తర్వాత మీడియాలో వచ్చిన కథనాలను పార్టీ అధిష్ఠానం చాలా సీరియస్‌గా తీసుకుందని ఆ లేఖలో పేర్కొన్నారు. ఈ పరిణామాలు పార్టీ ప్రతిష్ఠకు తీవ్ర భంగం కలిగించే విధంగా ఉన్నాయని అభిప్రాయపడ్డారు.

"ఈ అంశంపై సమగ్ర నివేదిక వచ్చే వరకు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని పార్టీ మిమ్మల్ని ఆదేశిస్తోంది. ఈ వ్యవహారానికి సంబంధించి మీ లిఖితపూర్వక వివరణను 5 రోజుల్లో పార్టీకి అందజేయాలి" అని నోటీసులో పల్లా శ్రీనివాసరావు స్పష్టం చేశారు. పుట్టా మహేశ్ ఇచ్చే వివరణను పరిశీలించిన తర్వాత పార్టీ అధిష్ఠానం తదుపరి చర్యలు తీసుకుంటుందని ఆయన తెలిపారు.
Putta Mahesh
TDP
Telugu Desam Party
Drugs Case
Show Cause Notice
Palla Srinivasa Rao
Moinabad Farmhouse
Eluru MP

More Telugu News