Sarfaraz Ahmed: అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్ బై చెప్పిన పాకిస్థాన్ మాజీ కెప్టెన్

Sarfaraz Ahmed Retires From International Cricket
పాకిస్థాన్ మాజీ కెప్టెన్, వికెట్ కీపర్ బ్యాటర్ సర్ఫరాజ్ అహ్మద్ తన అంతర్జాతీయ క్రికెట్ కెరీర్‌కు ముగింపు పలికాడు. సుమారు రెండు దశాబ్దాల పాటు సాగిన తన ప్రయాణానికి ఆదివారం వీడ్కోలు పలుకుతున్నట్లు ప్రకటించాడు. 2017లో సర్ఫరాజ్ సారథ్యంలోనే పాకిస్థాన్ జట్టు ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీని గెలుచుకోవడం విశేషం.

37 ఏళ్ల సర్ఫరాజ్ పాకిస్థాన్ తరఫున 54 టెస్టులు, 117 వన్డేలు, 61 టీ20 మ్యాచ్‌లు ఆడాడు. అన్ని ఫార్మాట్లలో కలిపి 6,164 పరుగులు చేశాడు. ఇందులో 6 సెంచరీలు, 35 అర్ధ సెంచరీలు ఉన్నాయి. వికెట్ కీపర్‌గా 315 క్యాచ్‌లు, 56 స్టంపింగ్‌లతో సత్తా చాటాడు. జూనియర్, సీనియర్ స్థాయిలో ఐసీసీ టైటిళ్లు గెలిపించిన ఏకైక కెప్టెన్‌గా సర్ఫరాజ్ అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు. 2006లో అతడి నాయకత్వంలోని అండర్-19 జట్టు ప్రపంచకప్ ఫైనల్‌లో భారత్‌ను ఓడించి టైటిల్ గెలిచింది.

సర్ఫరాజ్ కెప్టెన్సీలో పాకిస్థాన్ జట్టు టీ20 ఫార్మాట్‌లో అగ్రస్థానానికి చేరడంతో పాటు వరుసగా 11 సిరీస్‌లు గెలిచి ప్రపంచ రికార్డు సృష్టించింది. బాబర్ అజామ్, షహీన్ అఫ్రిది, హసన్ అలీ, ఫఖార్ జమాన్ వంటి స్టార్ ఆటగాళ్లు అతడి కెప్టెన్సీలోనే వెలుగులోకి వచ్చారు. "పాకిస్థాన్ తరఫున ఆడటం నా జీవితంలో దక్కిన గొప్ప గౌరవం. జట్టును అన్ని ఫార్మాట్లలో నడిపించాలన్న నా కల నెరవేరింది. నా ఎదుగుదలకు సహకరించిన సహచరులకు, కోచ్‌లకు, అభిమానులకు కృతజ్ఞతలు" అని సర్ఫరాజ్ తన ప్రకటనలో పేర్కొన్నాడు.

2007లో అంతర్జాతీయ అరంగేట్రం చేసిన సర్ఫరాజ్, తన చివరి మ్యాచ్‌ను 2023లో ఆస్ట్రేలియాపై ఆడాడు. ప్రస్తుతం అతను పాకిస్థాన్ షహీన్స్, అండర్-19 జట్లకు మేనేజర్, మెంటార్‌గా వ్యవహరిస్తున్నాడు. 

కాగా, మైదానంలో బద్ధకంగా ఉంటాడని సర్ఫరాజ్ పలు పర్యాయాలు విమర్శలు ఎదుర్కొన్నాడు. 
Sarfaraz Ahmed
Pakistan cricket
cricket retirement
Pakistan captain
ICC Champions Trophy
Babar Azam
Shahheen Afridi
Pakistan Shaheens
wicket keeper

More Telugu News