Nara Lokesh: అమరావతిలో బిట్స్ పిలాని ఏఐ క్యాంపస్.. ప్లాన్లను పరిశీలించిన మంత్రి నారా లోకేశ్

Nara Lokesh Reviews BITS Pilani AI Campus Plans in Amaravati
  • రూ.1,000 కోట్ల పెట్టుబడితో రెండు దశల్లో క్యాంపస్ నిర్మాణం
  • మొత్తం 7 వేల మంది విద్యార్థులకు ఏఐ, డేటా సైన్స్ కోర్సులు
  • దేశంలోనే ఇది తొలి ఏఐ క్యాంపస్ కానుందని తెలిపిన ప్రతినిధులు
  • క్యాంపస్ పనులను వేగవంతం చేయాలని మంత్రి లోకేష్ సూచన
ఏపీ రాజధాని అమరావతిలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించతలపెట్టిన బిర్లా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (BITS) పిలాని 'ఏఐ ప్లస్ క్యాంపస్' నిర్మాణ ప్లాన్లను రాష్ట్ర ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ నేడు పరిశీలించారు. ఉండవల్లిలోని నివాసంలో బిట్స్ ప్రతినిధులు సిద్ధార్థ బెనర్జీ, ఎన్.చెన్నవీర్, బీఎస్ సహాని మంత్రి నారా లోకేశ్ ను కలిసి క్యాంపస్ నిర్మాణ ప్రణాళికలను వివరించారు. నిర్మాణ ప్లాన్లను, డిజైన్లను ప్రదర్శించారు.

ఈ సందర్భంగా బిట్స్ ప్రతినిధులు మాట్లాడుతూ, రెండు దశల్లో 7 వేల మంది విద్యార్థులకు విద్యనందించేలా ఈ క్యాంపస్‌ను నిర్మిస్తున్నామని తెలిపారు. రానున్న ఐదేళ్లలో దీనిపై రూ.1,000 కోట్ల పెట్టుబడి పెట్టనున్నట్లు వెల్లడించారు. దేశంలోనే తొలి ఏఐ క్యాంపస్‌గా దీనిని తీర్చిదిద్దుతున్నామని, ముఖ్యమంత్రి చంద్రబాబు దార్శనికతకు అనుగుణంగా అత్యాధునిక టెక్నాలజీతో దీనిని నిర్మిస్తున్నట్లు పేర్కొన్నారు.

క్యాంపస్‌లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్, రోబోటిక్స్ వంటి కోర్సులతో పాటు వ్యవసాయం, వాతావరణం, ఆరోగ్య సంరక్షణకు సంబంధించిన కోర్సులను కూడా ప్రవేశపెట్టనున్నట్లు వివరించారు. పర్యావరణహితంగా గ్రీన్ బిల్డింగ్, పునరుత్పాదక ఇంధన విధానాలతో నిర్మాణం చేపడుతున్నామని, పనులు ఇప్పటికే ప్రారంభమయ్యాయని తెలిపారు. ప్లాన్లను పరిశీలించిన మంత్రి లోకేశ్ సంతృప్తి వ్యక్తం చేశారు. క్యాంపస్ నిర్మాణ పనులను వీలైనంత త్వరగా పూర్తి చేసి ప్రారంభించాలని వారికి సూచించారు.
Nara Lokesh
BITS Pilani
Amaravati
AI Campus
Andhra Pradesh
Artificial Intelligence
Data Science
Education
Technology
Chandrababu Naidu

More Telugu News