Chandra Kumar Bose: ఎర్రకోట మ్యూజియం నుంచి నేతాజీ టోపీ అదృశ్యం!

Chandra Kumar Bose Claims Netaji Cap Missing From Red Fort Museum
  • ఎర్రకోట మ్యూజియం నుంచి నేతాజీ టోపీ అదృశ్యమైందని ఆరోపణ
  • 2019లో తామే స్వయంగా మోదీకి టోపీని అందించామని చెప్పిన మనవడు
  • టోపీ ఉంచిన గ్లాస్ బాక్స్ ఖాళీగా ఉందని ఆవేదన
  • నేతాజీ అస్థికల తరలింపు పిటిషన్‌ను కొట్టివేసిన సుప్రీంకోర్టు
స్వాతంత్ర్య సమరయోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ ధరించిన టోపీ అదృశ్యమైందంటూ ఆయన మనవడు, బీజేపీ మాజీ నేత చంద్రకుమార్ బోస్ సంచలన ఆరోపణలు చేశారు. ఢిల్లీలోని ఎర్రకోటలో ఉన్న నేతాజీ మ్యూజియం నుంచి ఈ టోపీ మాయమైందని, దీనిపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వివరణ ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు.

గురువారం 'ఎక్స్' వేదికగా చంద్రకుమార్ బోస్ ఈ విషయాన్ని వెల్లడించారు. 2019 జనవరి 23న నేతాజీ జయంతి సందర్భంగా తాము కుటుంబసభ్యులతో కలిసి ఈ టోపీని స్వయంగా ప్రధాని మోదీకి అందించామని గుర్తుచేశారు. ఆ టోపీని ప్రధాని ఎర్రకోటలోని మ్యూజియంలో ప్రదర్శనకు ఉంచారని తెలిపారు.

ఇటీవల తమ సహచరుడు ఒకరు మ్యూజియంను సందర్శించగా టోపీని ఉంచిన గ్లాస్ బాక్స్ ఖాళీగా కనిపించిందని ఆయన పోస్టులో పేర్కొన్నారు. దీనిపై అక్కడి ఆర్కియాలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ASI) అధికారులు కూడా సరైన సమాధానం చెప్పలేకపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. దేశ అత్యున్నత నాయకుడికి సంబంధించిన చారిత్రక వస్తువు అదృశ్యం కావడం అత్యంత అవమానకరమని, ఈ విషయంలో ప్రధాని జోక్యం చేసుకోవాలని కోరారు.

ఇదిలా ఉండగా, ఇదే రోజు నేతాజీకి సంబంధించిన మరో కీలక పరిణామం సుప్రీంకోర్టులో చోటుచేసుకుంది. జపాన్‌లో ఉన్న నేతాజీ అస్థికలను భారత్‌కు తీసుకురావాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌ను విచారించేందుకు సర్వోన్నత న్యాయస్థానం నిరాకరించింది. నేతాజీ మరో మనవడైన ఆశిష్ రే ఈ పిటిషన్ దాఖలు చేయగా, ఆయన తరఫున సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ వాదనలు వినిపించారు. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం విముఖత చూపడంతో పిటిషన్‌ను ఉపసంహరించుకున్నారు. నేతాజీ కుమార్తె కొత్తగా పిటిషన్ దాఖలు చేసే అవకాశం ఉందని సింఘ్వీ కోర్టుకు తెలిపారు.
Chandra Kumar Bose
Netaji Subhas Chandra Bose
Red Fort Museum
Netaji cap missing
PM Modi
Archaeological Survey of India
Ashes of Netaji
Supreme Court
Ashish Ray

More Telugu News