క్రికెట్‌లో ఫిక్సింగ్ కలకలం.. వెస్టిండీస్ ఆల్‌రౌండర్‌పై ఐసీసీ వేటు

  • వెస్టిండీస్ క్రికెట్‌లో వెలుగు చూసిన అవినీతి కుంభకోణం
  • ఆల్ రౌండర్ జావాన్ సియర్లెస్‌ సహా ముగ్గురిపై ఐసీసీ చర్యలు
  • బిమ్10 టోర్నమెంట్‌లో ఫిక్సింగ్‌కు పాల్పడినట్లు ఆరోపణలు
  • ముగ్గురినీ తాత్కాలికంగా సస్పెండ్ చేసిన ఐసీసీ
  • ఐపీఎల్‌లో గతంలో కేకేఆర్‌ తరఫున ఆడిన సియర్లెస్
అంతర్జాతీయ క్రికెట్‌లో అవినీతి నిరోధక నియమావళి ఉల్లంఘనపై అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) కఠినంగా వ్యవహరించింది. వెస్టిండీస్ ఫాస్ట్ బౌలింగ్ ఆల్ రౌండర్ జావాన్ సియర్లెస్, టైటాన్స్ జట్టు యజమాని చిత్రరంజన్ రాథోడ్, జట్టు అధికారి గ్రిఫిత్‌పై అభియోగాలు మోపింది. వీరిని తక్షణమే అన్ని రకాల క్రికెట్ కార్యకలాపాల నుంచి తాత్కాలికంగా సస్పెండ్ చేస్తున్నట్లు ఐసీసీ ఒక ప్రకటనలో తెలిపింది.

2023-24లో జరిగిన బిమ్10 టోర్నమెంట్‌లో ఈ ముగ్గురూ అవినీతికి పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ టోర్నమెంట్ క్రికెట్ వెస్టిండీస్ (CWI) యాంటీ కరప్షన్ కోడ్ పరిధిలోకి వస్తుంది. మ్యాచ్ ఫలితాలను ప్రభావితం చేయడం (ఫిక్సింగ్), అవినీతి కార్యకలాపాలకు ఇతరులను ప్రోత్సహించడం, విచారణకు సహకరించకపోవడం వంటి పలు అభియోగాలను వీరిపై మోపారు. రాథోడ్‌పై మూడు, సియర్లెస్‌పై నాలుగు, గ్రిఫిత్‌పై నాలుగు అభియోగాలను సీడ‌బ్ల్యూఐ కోడ్ కింద నమోదు చేశారు.

వీటికి అదనంగా జట్టు అధికారి గ్రిఫిత్‌పై ఐసీసీ యాంటీ కరప్షన్ కోడ్ కింద మరో అభియోగం కూడా ఉంది. అంతర్జాతీయ మ్యాచ్‌లకు సంబంధించిన విచారణలో సాక్ష్యాలను తారుమారు చేయడం ద్వారా విచారణకు అడ్డుపడ్డారని ఆరోపించారు. ఈ అభియోగాలపై స్పందించేందుకు నిన్న‌టి నుంచి 14 రోజుల గడువు ఇచ్చారు.

జావాన్ సియర్లెస్ గతంలో వెస్టిండీస్ అండర్-19 జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. కరేబియన్ ప్రీమియర్ లీగ్ (సీపీఎల్‌)లో ఆడాడు. 2018 ఐపీఎల్ సీజన్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్‌) జట్టులో కూడా సభ్యుడిగా ఉన్నాడు. తాజా ఆరోపణలతో అతని కెరీర్ ప్రమాదంలో పడింది.


More Telugu News