ఇరాన్ డ్రోన్ దాడితో బహ్రెయిన్‌లోని చమురు టెర్మినల్‌లో మంటలు.. వీడియో ఇదిగో!

  • హైఅలర్ట్ ప్రకటించిన బహ్రెయిన్ అధికారులు
  • మంటలు ఆర్పేందుకు శ్రమిస్తున్న అగ్నిమాపక సిబ్బంది
  • సోషల్ మీడియాలో వైరల్ గా మారిన వీడియోలు
పశ్చిమాసియాలో యుద్ధం రోజురోజుకూ తీవ్రంగా మారుతోంది. ప్రతీకారదాడుల్లో భాగంగా ఇరన్ గల్ఫ్ దేశాలపై మిసైళ్ల వర్షం కురిపిస్తోంది. సూసైడ్ డ్రోన్లు, మిసైళ్లతో అమెరికా స్థావరాలపై విరుచుకుపడుతోంది. తాజాగా బహ్రెయిన్‌లోని ఒక కీలక చమురు నిల్వ కేంద్రంపై డ్రోన్ దాడి చేయడంతో ఆ ప్రాంతం రణరంగంగా మారింది. ఈ దాడి కారణంగా చమురు ట్యాంకులు పేలిపోయి, ఉవ్వెత్తున ఎగసిపడుతున్న మంటలు, దట్టమైన నల్లటి పొగలు కిలోమీటర్ల దూరం వరకు కనిపిస్తున్నాయి. అల్ జజీరా నివేదిక ప్రకారం.. ఈ దాడి జరిగిన వెంటనే స్థానిక అధికారులు హైఅలర్ట్ ప్రకటించారు.

ప్రస్తుతం అగ్నిమాపక దళాలు మంటలను అదుపులోకి తెచ్చేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్నాయి. అయితే, భారీ స్థాయిలో చమురు నిల్వలు ఉండటంతో సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడుతోంది. ఈ ఘటనతో పర్షియన్ గల్ఫ్ ప్రాంతంలో భద్రతపై తీవ్ర ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.

అమెరికా, ఇజ్రాయెల్ దళాలకు వ్యూహాత్మక మద్దతు ఇస్తున్న దేశాలపై ప్రతీకారం తీర్చుకుంటామని ఇరాన్ చేసిన హెచ్చరికల నేపథ్యంలోనే ఈ దాడి జరిగినట్లు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. బహ్రెయిన్ వంటి చిన్న దేశాలలోని చమురు మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకోవడం ద్వారా గల్ఫ్ ప్రాంతంలో ఇంధన సరఫరా వ్యవస్థను దెబ్బతీయడమే ఇరాన్ ప్రధాన ఉద్దేశ్యంగా కనిపిస్తోందన్నారు.


More Telugu News