నాగార్జున 100వ చిత్రం.. ఆసక్తికర విషయాలు వెల్లడించిన దర్శకుడు

  • సైలెంట్‌గా షూటింగ్ జరుపుకుంటున్న నాగార్జున 100వ సినిమా
  • శివ, రక్షకుడు చిత్రాల నాటి పవర్‌ఫుల్ లుక్‌లో నాగ్
  • ఈ చిత్రంలో మూడు వేర్వేరు గెటప్స్‌లో కనిపించనున్న కింగ్
  • కథ నచ్చితే చాలంటూ కొత్త దర్శకుడికి అవకాశం ఇచ్చిన నాగార్జున
  • కీలక పాత్రలో టబు, మరో హీరోయిన్‌గా సుస్మిత నటించే అవకాశం
టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున తన కెరీర్‌లో అత్యంత ప్రతిష్ఠాత్మకమైన 100వ సినిమాను సైలెంట్‌గా పూర్తి చేసే పనిలో ఉన్నారు. ఇప్పటివరకు అధికారిక ప్రకటన రానప్పటికీ, 'కింగ్ 100' అనే వర్కింగ్ టైటిల్‌తో ఈ చిత్రం షూటింగ్ జరుపుకుంటోంది. తమిళ దర్శకుడు రా. కార్తీక్ దర్శకత్వం వహిస్తుండగా, నాగార్జున స్వయంగా నిర్మిస్తున్నారు. తాజాగా దర్శకుడు కార్తీక్ ఓ ఇంటర్వ్యూలో ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన ఎన్నో ఆసక్తికర విషయాలను పంచుకోవడంతో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి.

  నాగార్జునను ఆయన అభిమానులు ఎలా చూడాలనుకుంటున్నారో సరిగ్గా అలాగే ఈ సినిమాలో చూపించబోతున్నట్లు కార్తీక్ తెలిపారు. గతంలో నాగార్జున కెరీర్‌లో కల్ట్ క్లాసిక్స్‌గా నిలిచిన శివ‌, ర‌క్ష‌కుడు వంటి చిత్రాల్లో కనిపించిన పవర్‌ఫుల్, స్టైలిష్ అవతారంలో ఆయన మరోసారి దర్శనమివ్వనున్నారని స్పష్టం చేశారు. అలాగే కథానుసారం ఈ సినిమాలో నాగార్జున ఏకంగా మూడు విభిన్నమైన గెటప్స్‌లో కనిపిస్తారని చెప్పడం ఉత్కంఠను రేకెత్తిస్తోంది. ఈ సినిమా కోసం నాగార్జున ఎంతో శ్రద్ధ తీసుకుంటున్నారని, ఆయన లుక్ అభిమానులకు పండగలా ఉంటుందని దర్శకుడు హామీ ఇచ్చారు.

అయితే, ఇంతటి ప్రతిష్ఠాత్మకమైన 100వ సినిమాకు ఓ స్టార్ డైరెక్టర్‌ను కాకుండా, అనుభవం తక్కువ ఉన్న తమిళ దర్శకుడిని ఎంచుకోవడంపై చాలామంది ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఇదే విషయాన్ని తాను కూడా నాగార్జునను అడిగానని కార్తీక్ వెల్లడించారు. "నాగార్జున గారితో సినిమా చేయడానికి చాలా మంది దర్శకులు ఎదురుచూస్తుంటారు. మంచి కథలతో వస్తుంటారు. అలాంటిది ఈ అవకాశం నాకు ఎలా ఇచ్చారని అడిగాను. దానికి ఆయన 'కథ నచ్చితే చాలు.. నేను గత 40 ఏళ్లుగా కొత్త దర్శకులతో పనిచేస్తున్నాను' అని సింపుల్‌గా సమాధానమిచ్చారు" అని కార్తీక్ వివరించారు.

గతంలో కూడా నాగార్జున మ‌ణిర‌త్నం (గీతాంజ‌లి), ప్రియ‌ద‌ర్శ‌న్ వంటి ఇతర భాషల దర్శకులతో పనిచేసి బ్లాక్‌బస్టర్లు అందుకున్న విషయాన్ని గుర్తుచేశారు. ఇక, ఈ సినిమాలో నాగార్జునకు జోడీగా ముగ్గురు హీరోయిన్లు నటించనున్నట్లు తెలుస్తోంది. వారిలో సీనియర్ నటి ట‌బు ఓ కీలక పాత్ర పోషిస్తుండగా, 'నాట్యం' ఫేమ్ సుస్మిత భ‌ట్ మరో కథానాయికగా ఎంపికైనట్లు సమాచారం. ఈ తాజా అప్‌డేట్స్‌తో 'కింగ్ 100'పై అభిమానుల్లో ఉన్న అంచనాలు రెట్టింపయ్యాయి.


More Telugu News