రేవంత్ ఫ్లాప్, జగన్ టఫ్, పవన్ నాన్ సీరియస్.. రాజకీయ నేతలపై కవిత ‘వన్ వర్డ్’ కామెంట్స్ వైర‌ల్‌

  • తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఒక ఫ్లాప్ సీఎం అని విమర్శ
  • చంద్రబాబు పట్టుదల గ్రేట్ అని, జగన్ గట్టి లీడర్ అని ప్రశంస
  • పవన్ కల్యాణ్ ఒక నాన్ సీరియస్ వ్యక్తి అని వ్యాఖ్య
  • తెలంగాణకు కాబోయే సీఎం తానేన‌న్న కల్వకుంట్ల కవిత 
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తెలుగు రాష్ట్రాల రాజకీయ నేతలపై చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి. ఓ యూట్యూబ్ ఛానెల్‌కు ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో యాంకర్ అడిగిన ప్రశ్నలకు ఆమె ఒకే పదంలో స్పందిస్తూ పలువురు ప్రముఖులపై తన అభిప్రాయాలను వెల్లడించారు. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపుతున్నాయి.

ఇంటర్వ్యూలో భాగంగా తెలంగాణ నేతల గురించి కవిత తనదైన శైలిలో స్పందించారు. తన తండ్రి, మాజీ సీఎం కేసీఆర్‌ను "గొప్ప ఉద్యమ నాయకుడు" అని అభివర్ణించారు. ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మాత్రం "ఫ్లాప్ సీఎం" అంటూ ఘాటుగా విమర్శించారు. బీజేపీ నేత ఈటెల రాజేందర్‌ను "గట్టి ఫైటర్" అని పేర్కొన్న కవిత, మరో నేత ధర్మపురి అరవింద్‌ను "అబద్ధానికి ప్రతిరూపం" అని వ్యాఖ్యానించారు. బండి సంజయ్ గురించి మాట్లాడుతూ.. "అన్నను గెలవనివ్వరు, ఏమీ చేయనివ్వరు" అంటూ తన అభిప్రాయం చెప్పారు.

ఇదే క్రమంలో ఏపీ రాజకీయ నేతలపైనా కవిత తన అభిప్రాయాలను పంచుకున్నారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడుతూ, "ఈ వయసులో అద్భుతమైన పట్టుదలతో మళ్లీ సీఎం అయ్యేవరకూ కొట్లాడారు, గ్రేట్" అని ప్రశంసించారు. మాజీ సీఎం వైఎస్ జగన్‌ను "గట్టి లీడర్" అని, ఆయన తండ్రి దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డిని "గుడ్ లీడర్" అని పేర్కొన్నారు. వైఎస్ షర్మిల ఏపీకి సీఎం కావాలని తాను కోరుకుంటున్నట్లు తెలిపారు. ఇక, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ను "నాన్ సీరియస్ పర్సన్" అని, నారా లోకేశ్‌ ఇంకా నేర్చుకుంటున్నారని అభిప్రాయపడ్డారు.

అన్నింటికన్నా ముఖ్యంగా తన గురించి తాను స్పందిస్తూ "ఫ్యూచర్ సీఎం ఆఫ్ తెలంగాణ" అని కవిత ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ, ఏపీకి చెందిన అధికార, ప్రతిపక్ష నేతలపై ఆమె చేసిన ఈ సూటి వ్యాఖ్యలతో కూడిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.


More Telugu News