బీసీ కులగణనలో తప్పులుంటే సరిచేస్తాం.. సీఎం రేవంత్ కీలక ప్రకటన
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

బీసీ కులగణనలో తప్పులుంటే సరిచేస్తాం.. సీఎం రేవంత్ కీలక ప్రకటన

Revanth Reddy Announces Corrections To BC Caste Census If Errors Exist
  • వివరాలు నమోదు కానివారు ప్రభుత్వానికి తెలియజేయాలని సూచన
  • వచ్చే కేబినెట్‌లో కులగణన లెక్కలపై చర్చ
  • ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే అంశాన్ని పరిశీలిస్తామని హామీ
  • ముదిరాజ్ నాయకులకు మరిన్ని అవకాశాలు కల్పిస్తామని హామీ
  • పండుగ సాయన్న, దొడ్డి కొమురయ్య విగ్రహాల ఏర్పాటుకు హామీ
బీసీ కులగణనలో తమ వివరాలు నమోదు కాలేదని భావించే వారు ముందుకొస్తే లెక్కలను సరిచేసేందుకు సిద్ధంగా ఉన్నామని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. అవసరమైతే బీసీ జనాభా లెక్కలను సవరించి, జాబితాలోకి రాని వారిని చేర్చుతామని స్పష్టం చేశారు. బీసీ వర్గాలకు సామాజిక న్యాయం చేయడమే తమ ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు.

హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో నిర్వహించిన పండుగ సాయన్న ముదిరాజ్ జయంతి వేడుకల్లో సీఎం పాల్గొని మాట్లాడారు. వందేళ్లలో ఎవరూ చేయని సాహసం తమ ప్రభుత్వం చేసిందని, ఏడాదిలోనే కులగణన పూర్తి చేసి తొలిసారిగా బీసీల జనాభా లెక్కలను తేల్చామని అన్నారు. ఏ కులం వారైనా తమ జనాభా తక్కువగా నమోదైందని భావిస్తే సంబంధిత వివరాలు అందించాలని సూచించారు. వచ్చే కేబినెట్ సమావేశంలో ఈ అంశంపై చర్చించి లెక్కలను మరింత పక్కాగా చేస్తామని వెల్లడించారు.

తనకు అవకాశం ఉంటే తన కుర్చీ చుట్టూ బలహీనవర్గాలను కూర్చోబెట్టుకోవాలన్నదే తన ఆలోచన అని రేవంత్ రెడ్డి అన్నారు. ముదిరాజ్‌లను ప్రస్తుతం బీసీ-డీ జాబితా నుంచి బీసీ-ఏలోకి మార్చాలన్న డిమాండ్‌పైనా సీఎం స్పందించారు. ఈ అంశంపై ముదిరాజ్ నాయకులు న్యాయ నిపుణులను సంప్రదించి, ఉన్న అవకాశాలను పరిశీలించాలని సూచించారు. గంగపుత్రుల్లో ఉన్న అపోహలను కూడా తెలుసుకోవాలని అన్నారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముదిరాజ్ సామాజికవర్గానికి చెందిన పలువురికి పదవులు కల్పించామని, మిగిలిన నాయకులకు కూడా త్వరలో అవకాశాలు వస్తాయని హామీ ఇచ్చారు.

తన పనితీరుపై మాట్లాడుతూ పరోక్షంగా గత సీఎం కేసీఆర్‌ను ఉద్దేశించి విమర్శలు చేశారు. తనకు ఇంకా వయసు, ఓపిక ఉన్నాయని, తాను ఫామ్‌హౌస్‌లో పడుకునే రకాన్ని కాదని వ్యాఖ్యానించారు.

పండుగ సాయన్న జయంతి, వర్ధంతి వేడుకలను అధికారికంగా నిర్వహిస్తామని సీఎం ప్రకటించారు. పండుగ సాయన్న కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. దొడ్డి కొమురయ్య, పండుగ సాయన్న విగ్రహాలను ట్యాంక్‌బండ్‌ సమీపంలో ఏర్పాటు చేస్తామని తెలిపారు. బలహీనవర్గాలకు సామాజిక న్యాయం, సమాన అవకాశాలు కల్పించేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు.
Advertisement
Revanth Reddy
Telangana BC Caste Census
Mudiraj Community Welfare
Panduga Sayanna Jayanthi
Telangana Government Social Justice
Hyderabad News Updates

More Telugu News