పార్టీ ఫిరాయింపుల వ్యవహారం... కడియం, దానంలకు క్లీన్ చిట్ ఇచ్చిన స్పీకర్

  • కడియం, దానంలపై దాఖలైన అనర్హత పిటిషన్లను కొట్టివేసిన స్పీకర్
  • పార్టీ మారినట్టు సరైన ఆధారాలు లేవన్న స్పీకర్
  • తాజా తీర్పుతో మొత్తం 10 మంది ఎమ్మెల్యేలకు క్లీన్ చిట్

తెలంగాణ రాజకీయాల్లో గత కొంతకాలంగా ఉత్కంఠ రేపుతున్న ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ల వ్యవహారానికి స్పీకర్ గడ్డం ప్రసాద్ తెరదించారు. అధికార కాంగ్రెస్ పార్టీలో చేరారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరిలపై దాఖలైన అనర్హత పిటిషన్లను ఆయన కొట్టివేస్తూ, వీరికి క్లీన్ చిట్ ఇచ్చారు. వీరిద్దరూ అధికారికంగా పార్టీ మారినట్లు సరైన ఆధారాలు లేవని, ఈ కారణంగా వారిపై అనర్హత వేటు వేయలేమని స్పీకర్ తన తీర్పులో స్పష్టం చేశారు.


ఈ అంశంపై రేపు (గురువారం) సుప్రీంకోర్టులో విచారణ జరగాల్సి ఉంది. కోర్టు విచారణకు ముందు రోజు ఈ వ్యవహారంపై స్పీకర్ తన విచారణను ముగించి, తీర్పులను వెలువరించారు. దానం, కడియంలతో పాటు పార్టీ ఫిరాయింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న మొత్తం 10 మంది ఎమ్మెల్యేలకు స్పీకర్ క్లీన్ చిట్ ఇవ్వడం గమనార్హం. ఫిర్యాదుదారులు సమర్పించిన ఆధారాలు వారిని అనర్హులుగా ప్రకటించడానికి సరిపోవని స్పీకర్ తన తీర్పులో పేర్కొన్నారు. అయితే, స్పీకర్ నిర్ణయంపై ప్రతిపక్ష బీఆర్ఎస్ నేతలు ఎలా స్పందిస్తారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.



More Telugu News