Nara Lokesh: ‘మన బడి’కి ఊతం.. రూ.5 కోట్ల విరాళం ప్రకటించిన నెల్లూరు దంపతులు.. మంత్రి లోకేశ్‌ ప్రశంసలు

Nara Lokesh Praises Nellore Couple for Rs 5 Crore Donation to Schools
  • నెల్లూరు జిల్లాకు చెందిన బచ్చు కృష్ణకుమార్ దంపతుల భారీ విరాళం
  • బోగోలు మండలంలో అభివృద్ధి పనులకు మొత్తం రూ.15 కోట్లు
  • ప్రభుత్వ పాఠశాలలు, కాలేజీల కోసం రూ.5 కోట్ల కేటాయింపు
  • మరో రూ.10 కోట్లతో ఆసుపత్రి, దేవాలయ అభివృద్ధి
  • దంపతులను అభినందించిన మంత్రి నారా లోకేశ్‌
నెల్లూరు జిల్లాకు చెందిన దంపతులు తమ ఉదారతను చాటుకున్నారు. తమ స్వస్థలమైన బోగోలు మండలంలో విద్య, వైద్యం, ఆధ్యాత్మిక రంగాల అభివృద్ధికి ఏకంగా రూ.15 కోట్ల భారీ విరాళాన్ని ప్రకటించి అందరికీ ఆదర్శంగా నిలిచారు. అమరా బచ్చు ఛారిటబుల్ ట్రస్ట్ ద్వారా విస్తృతంగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న బచ్చు కృష్ణకుమార్‌ దంపతులు ఈ సాయాన్ని అందించేందుకు ముందుకు వచ్చారు.

ఉండవల్లిలోని తన నివాసంలో రాష్ట్ర ఐటీ, మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేశ్‌తో కృష్ణకుమార్‌ దంపతులు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా బోగోలు మండలంలోని ప్రభుత్వ పాఠశాలలు, జూనియర్ కళాశాలల్లో విద్యార్థులకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పన కోసం తమ ట్రస్ట్ ద్వారా రూ.5 కోట్లు అందిస్తామని ప్రకటించారు. త్వరలో చేపట్టనున్న ఈ అభివృద్ధి పనుల శంకుస్థాపన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరుకావాలని మంత్రి లోకేశ్‌ను వారు ఆహ్వానించారు.

అలాగే బోగోలు మండలం కొవ్వూరుపల్లిలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం అభివృద్ధి, ఆధునికీకరణ కోసం మరో రూ.5 కోట్లు, చారిత్రక కొండబిట్రగుంటలోని శ్రీప్రసన్న వేంకటేశ్వరస్వామి దేవస్థానం అభివృద్ధికి ఇంకో రూ.5 కోట్లు కేటాయించనున్నట్లు తెలిపారు. మొత్తం రూ.15 కోట్ల భారీ విరాళాన్ని ప్రకటించిన కృష్ణకుమార్‌ దంపతుల గొప్ప మనసును మంత్రి లోకేశ్‌ ప్రత్యేకంగా అభినందించారు. వారి సేవలను ప్రశంసిస్తూ మంత్రి ట్వీట్ కూడా చేశారు.

"నెల్లూరు జిల్లా బోగోలుకు చెందిన అమరా ఛారిటబుల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ బచ్చు కృష్ణ కుమార్ దంపతులను ఉండవల్లి నివాసంలో కలిశాను. బోగోలు మండలంలోని ప్రభుత్వ పాఠశాలలు, జూనియర్ కాలేజీల్లో విద్య, మౌలిక సదుపాయాల అభివృద్ధికి రూ.5 కోట్ల సాయం అందించినందుకు అభినందనలు తెలిపాను" అని లోకేశ్ త‌న పోస్టులో పేర్కొన్నారు.

రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసేందుకు ప్రభుత్వం ‘మన బడి-మన భవిష్యత్తు’ కార్యక్రమాన్ని అమలు చేస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ఎన్నారైలు, పూర్వ విద్యార్థులు, దాతలను భాగస్వాములను చేస్తోంది. పాఠశాలల అభివృద్ధికి సాయం చేసే దాతల పేర్లను ఆయా స్కూళ్లకు పెట్టే అవకాశాన్ని కూడా ప్రభుత్వం కల్పిస్తోంది. 
Nara Lokesh
Nara Lokesh
Bacchu Krishna Kumar
Amara Charitable Trust
Nellore
Bogolu
Mana Badi
Government Schools
Infrastructure Development
Andhra Pradesh

More Telugu News