వరంగల్‌లో అధికారుల అత్యుత్సాహం.. ఇంటి పన్ను కోసం గ్యాస్ సిలిండర్ జప్తు

  • ఇంటి పన్ను కట్టలేదని పేదరాలి సిలిండర్ స్వాధీనం
  • వరంగల్ కాశీబుగ్గలో వెలుగుచూసిన ఘటన
  • అధికారులు బెదిరించి సిలిండర్ తీసుకెళ్లారని బాధితురాలి ఆరోపణ
  • అప్పుచేసి పన్ను చెల్లించాక సిలిండర్‌ను తిరిగిచ్చిన సిబ్బంది
వరంగల్ మహానగరపాలక సంస్థ అధికారుల తీరు తీవ్ర విమర్శలకు దారితీసింది. ఇంటి పన్ను చెల్లించలేదన్న కారణంతో ఓ నిరుపేద కుటుంబం ఇంట్లోని వంట గ్యాస్ సిలిండర్‌ను బలవంతంగా తీసుకెళ్లిన ఘటన కాశీబుగ్గ ప్రాంతంలో చోటుచేసుకుంది. ఈ చర్యపై స్థానికంగా తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది.

బాధితురాలు గొలుసుల సుజాత తెలిపిన వివరాల ప్రకారం.. ఆమె ఇంటి పన్ను చెల్లించాల్సి ఉందని గత నెల 23న నగరపాలక సంస్థ అధికారులు నోటీసు ఇచ్చారు. ఈ క్రమంలో నిన్న‌ రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ సోహైల్ నేతృత్వంలో ఆరుగురు సిబ్బంది ఆమె ఇంటికి వచ్చారు. పన్ను ఇంకా చెల్లించకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేస్తూ, వంట చేసుకుంటున్న గ్యాస్ సిలిండర్‌ను స్వాధీనం చేసుకున్నారు.

ఇంట్లో ఉన్నది ఒకే ఒక్క సిలిండర్ అని, దాన్ని తీసుకెళ్తే వంట ఎలా చేసుకోవాలని సుజాత ప్రాధేయపడినా అధికారులు వినిపించుకోలేదని ఆమె కన్నీటిపర్యంతమయ్యారు. చేసేదేమీ లేక, అప్పు చేసి రూ.5,280 పన్నును సాయంత్రం చెల్లించడంతో అధికారులు సిలిండర్‌ను తిరిగి ఇచ్చారు. ధనవంతుల ఇళ్లకు వెళితే అధికారులు నమస్కరించి వస్తున్నారని, తమలాంటి పేదలపై మాత్రం పన్నుల పేరుతో జులుం ప్రదర్శిస్తున్నారని సుజాత ఆవేదన వ్యక్తం చేశారు.


More Telugu News