శ్రీవారి పరకామణిలో చోరీపై టీటీడీ క్లారిటీ.. వాస్తవాలు ఇవే!

  • పరకామణిలో భారీ చోరీ ప్రచారం అవాస్తవమన్న టీటీడీ
  • 100 గ్రాముల బంగారం బిస్కెట్‌తో పట్టుబడ్డ ఔట్‌సోర్సింగ్‌ సిబ్బంది
  • నిందితుడి ఇంట్లో సోదాలు.. మరో 555 గ్రాముల బంగారం స్వాధీనం
  • కేసు కోర్టు విచారణలో ఉందని.. వదంతులు నమ్మవద్దని విజ్ఞప్తి
  • పరకామణిలో బహుళ అంచెల భద్రతా వ్యవస్థ ఉందని స్పష్టీకరణ
తిరుమల శ్రీవారి పరకామణిలో కోట్ల రూపాయల విలువైన బంగారం చోరీకి గురైందంటూ ఓ పత్రికలో వచ్చిన కథనాన్ని, సంబంధిత ప్రచారాన్ని టీటీడీ ఖండించింది. ఈ వార్తలు పూర్తిగా అవాస్తవమని, వాస్తవాలను వక్రీకరించి దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపిస్తూ టీటీడీ ఓ అధికారిక ప్రకటన విడుదల చేసింది. పరకామణిలో జరిగిన ఒక చిన్న సంఘటనను భూతద్దంలో చూపి భక్తులను ఆందోళనకు గురిచేయడం సరికాదని హితవు పలికింది.

టీటీడీ వెల్లడించిన వివరాల ప్రకారం 2025 జనవరి 11న పరకామణిలో ఔట్‌సోర్సింగ్‌ పద్ధతిలో పనిచేస్తున్న పెంచలయ్య అనే సిబ్బంది, 100 గ్రాముల బంగారు బిస్కెట్‌ను అపహరించేందుకు ప్రయత్నించాడు. అయితే, అక్కడ అప్రమత్తంగా ఉన్న టీటీడీ విజిలెన్స్‌, సెక్యూరిటీ సిబ్బంది వెంటనే అతడిని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఈ ఘటన మొత్తం సీసీటీవీ కెమెరాల్లో స్పష్టంగా రికార్డయింది. పక్కా ఆధారాలతో నిందితుడిపై కేసు నమోదు చేసి అరెస్టు చేసినట్లు టీటీడీ స్పష్టం చేసింది.

ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు, నిందితుడు పెంచలయ్య నివాసంతో పాటు ఇతర ప్రాంతాల్లో సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లో 555.5 గ్రాముల బంగారు ఆభరణాలు, 157 గ్రాముల వెండి వస్తువులను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. దొంగిలించిన బంగారాన్ని జ్యువెలరీ షాపుల్లో మార్పిడి చేసిన ఇన్‌వాయిస్‌లను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో భాగంగా 12 మంది సాక్షులను విచారించి, అన్ని ఆధారాలతో పోలీసులు కోర్టులో ఛార్జ్‌షీట్‌ దాఖలు చేశారని టీటీడీ తెలిపింది. ఏప్రిల్ 13న ఈ కేసుకు సంబంధించి కోర్టులో విచారణ జరగనుంది.

పరకామణిలో బహుళ అంచెల భద్రతా వ్యవస్థ: టీటీడీ 
పరకామణిలో బహుళ అంచెల భద్రతా వ్యవస్థ, కఠినమైన నియంత్రణ విధానాలు, నిరంతర సీసీటీవీ పర్యవేక్షణ అమలులో ఉన్నాయని టీటీడీ పునరుద్ఘాటించింది. ఒక ఉద్యోగి చేసిన చోరీ యత్నాన్ని సమర్థవంతంగా అడ్డుకున్నామని, దీనిని భారీ దొంగతనంగా చిత్రీకరిస్తూ అసత్య ప్రచారం చేయడం తగదని పేర్కొంది. భక్తులు, ప్రజలు ఇలాంటి నిరాధారమైన వదంతులను నమ్మవద్దని టీటీడీ విజ్ఞప్తి చేసింది.


More Telugu News