దలాల్ స్ట్రీట్‌లో 'బ్లడ్ బాత్': సెన్సెక్స్ 2000 పాయింట్ల పతనం.. ఇన్వెస్టర్ల సొమ్ము ఆవిరి!

  • పశ్చిమాసియా ఉద్రిక్తతలతో కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు
  • 2000 పాయింట్లకు పైగా పతనమైన సెన్సెక్స్
  • కీలకమైన 24,000 మార్కు దిగువకు చేరిన నిఫ్టీ
  • భారీగా పెరిగిన ముడిచమురు ధరలు.. రికార్డు  కనిష్టానికి రూపాయి
  • అమ్మకాల ఒత్తిడితో బెంబేలెత్తిన ఇన్వెస్టర్లు
పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు కమ్ముకోవడంతో భారత స్టాక్ మార్కెట్లు సోమవారం భారీ నష్టాలతో ప్రారంభమయ్యాయి. ఇన్వెస్టర్లు అమ్మకాలకు తెగబడటంతో ట్రేడింగ్ మొదలైన కొద్దిసేపటికే బీఎస్ఈ సెన్సెక్స్ 2000 పాయింట్లకు పైగా కుప్పకూలింది. అదేవిధంగా, ఎన్ఎస్ఈ నిఫ్టీ కూడా కీలకమైన 24,000 మార్కును కోల్పోయి దిగువకు పడిపోయింది. దీంతో దలాల్ స్ట్రీట్‌లో ఒక్కసారిగా ఆందోళన వాతావరణం నెలకొంది.

అమెరికా, ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు తీవ్రరూపం దాల్చడంతో అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు భగ్గుమన్నాయి. బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర ఏకంగా 20 శాతానికి పైగా పెరిగి బ్యారెల్‌కు 114 డాలర్ల స్థాయిని దాటింది. భారత్ తన చమురు అవసరాల్లో దాదాపు 88 శాతం దిగుమతులపైనే ఆధారపడుతుంది. ఈ నేపథ్యంలో, పెరిగిన చమురు ధరలు దేశంలో ద్రవ్యోల్బణాన్ని పెంచుతాయనే భయాలు ఇన్వెస్టర్లలో మొదలయ్యాయి. దీంతో విదేశీ, స్వదేశీ సంస్థాగత మదుపరులు తమ పెట్టుబడులను వెనక్కి తీసుకుంటున్నారు.

మార్కెట్ల పతనంతో పాటు డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ కూడా రికార్డు కనిష్టానికి పడిపోయింది. సోమవారం ఉదయం రూపాయి 46 పైసలు నష్టపోయి 92.20 వద్ద ట్రేడ్ అయింది. మార్కెట్లో భయాలకు సూచికగా భావించే ఇండియా వీఐఎక్స్ (VIX) 20 శాతానికి పైగా పెరగడం ఇన్వెస్టర్లలో నెలకొన్న తీవ్ర ఆందోళనను సూచిస్తోంది. బ్యాంకింగ్, ఎనర్జీ, ఐటీ సహా అన్ని రంగాల షేర్లు నష్టాల్లోనే కొనసాగుతున్నాయి. గత వారం కూడా మార్కెట్లు భారీ నష్టాలను చవిచూశాయి. ఇప్పుడు యుద్ధ భయాలు తోడవడంతో అమ్మకాల ఒత్తిడి మరింత పెరిగింది. ఈ ఉద్రిక్తతలు ఇలాగే కొనసాగితే మార్కెట్లు మరింత పతనం కావొచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

Indian Stock Market
Sensex
Nifty
Share Market Crash
Stock Market
Crude Oil Price
Rupee Value
Dalal Street
Market Volatility

More Telugu News