అమెరికా రక్షణశాఖతో ఒప్పందం... ఓపెన్ఏఐలో దుమారం... రోబోటిక్స్ చీఫ్ రాజీనామా

  • పెంటగాన్ క్లాసిఫైడ్ నెట్‌వర్క్‌లో ఏఐ మోడల్స్ వినియోగంపై అసంతృప్తి
  • రాజీనామా చేసిన ఓపెన్ ఏఐ రోబోటిక్స్ టీమ్ హెడ్ కైట్లిన్ కలినోవ్ స్కీ
  • మానవ ప్రమేయం లేని ఆయుధాల వినియోగంపై ఆందోళన
  • బాధ్యతాయుతమైన రక్షణ అవసరాల కోసమే ఒప్పందమన్న ఓపెన్ ఏఐ
ప్రముఖ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంస్థ ఓపెన్ ఏఐలో మరోసారి అసమ్మతి స్వరం వినిపించింది. అమెరికా రక్షణ విభాగం (పెంటగాన్)తో ఓపెన్ ఏఐ కుదుర్చుకున్న ఒప్పందంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ.. ఆ సంస్థ రోబోటిక్స్ విభాగం అధిపతి కైట్లిన్ కలినోవ్ స్కీ తన పదవికి రాజీనామా చేశారు. పెంటగాన్ క్లాసిఫైడ్ నెట్‌వర్క్‌లో ఏఐ మోడల్స్‌ను వినియోగించేందుకు కంపెనీ నిర్ణయించడం వల్లే తాను వైదొలుగుతున్నట్లు ఆమె ప్రకటించారు.

ఈ సందర్భంగా సోషల్ మీడియా వేదికగా కైట్లిన్ స్పందిస్తూ.. "జాతీయ భద్రతలో ఏఐ పాత్ర కీలకమే. అయితే న్యాయపరమైన పర్యవేక్షణ లేకుండా అమెరికన్లపై నిఘా పెట్టడం, మానవ అనుమతి లేకుండా స్వయంప్రతిపత్తితో పనిచేసే ఆయుధాలను వినియోగించడం వంటి అంశాలపై మరింత లోతుగా చర్చించాల్సిన అవసరం ఉంది" అని అభిప్రాయపడ్డారు. ఈ నిర్ణయం తీసుకోవడం తనకు చాలా కష్టంగా అనిపించిందని ఆమె పేర్కొన్నారు. కైట్లిన్ 2024 నవంబర్‌లో మెటా నుంచి ఓపెన్ ఏఐలో చేరారు.

దీనిపై ఓపెన్ ఏఐ స్పందిస్తూ.. జాతీయ భద్రత కోసం ఏఐని బాధ్యతాయుతంగా వినియోగించేలా రక్షణ శాఖతో ఒప్పందం చేసుకున్నామని వివరించింది. దేశీయ నిఘా కోసం గానీ, స్వయంప్రతిపత్త ఆయుధాల తయారీకి గానీ తమ టెక్నాలజీని వాడబోమని స్పష్టం చేసింది. ఉద్యోగులు, ప్రభుత్వం, పౌర సమాజంతో నిరంతరం చర్చలు జరుపుతామని తెలిపింది.

ఇదిలా ఉండగా, ఫిబ్రవరి చివర్లో ఓపెన్ ఏఐ పెంటగాన్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. మరోవైపు, ట్రంప్ ప్రభుత్వంతో చర్చలు విఫలమవడంతో ఆంథ్రోపిక్ సంస్థను పెంటగాన్ 'సప్లయ్ చైన్ రిస్క్' జాబితాలో చేర్చింది. దీనిపై ఆంథ్రోపిక్ సీఈఓ స్పందిస్తూ.. ట్రంప్ పట్ల గతంలో చేసిన విమర్శలకు క్షమాపణలు చెప్పారు. ఆంథ్రోపిక్‌ను బ్లాక్ లిస్ట్‌లో పెట్టడాన్ని ఓపెన్ ఏఐ కూడా వ్యతిరేకించడం గమనార్హం.




More Telugu News