హస్కీ వాయిస్‌కు పడిపోయి.. రూ. 24 లక్షలు పోగొట్టుకున్న వృద్ధుడు

  • హైదరాబాద్‌లో వృద్ధుడిని మోసగించిన సైబర్ కేటుగాళ్లు
  • తీయనైన మాటలతో నమ్మించి యాప్‌లో పెట్టుబడులు
  • రూ. 62 లక్షల లాభం వచ్చినట్టు నమ్మించిన వైనం
  • విడతల వారీగా రూ. 24 లక్షలకు పైగా కాజేసిన మోసగాళ్లు
  • సైబరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితుడు
సైబర్ నేరగాళ్లు రోజుకో కొత్త పంథాలో మోసాలకు పాల్పడుతున్నారు. తాజాగా హైదరాబాద్‌లో ఓ వృద్ధుడు సైబర్ మోసానికి గురై భారీగా డబ్బు పోగొట్టుకున్నాడు. కేటుగాళ్ల మాయ మాటలు నమ్మి ఏకంగా రూ. 24 లక్షలు సమర్పించుకున్నారు. ఈ ఘటన హైదరాబాద్‌లో కలకలం రేపింది.

గోపన్‌పల్లికి చెందిన 80 ఏళ్ల బాధితుడికి 'రిధివెలే' అనే పేరుతో ఓ మహిళ ఫోన్ చేసింది. తన మాటల గారడీతో వృద్ధుడిని నమ్మించి యాప్స్‌లో పెట్టుబడి పెడితే తక్కువ సమయంలో ఎక్కువ లాభాలు వస్తాయని ఆశ చూపింది. ఆమె మాటలను పూర్తిగా విశ్వసించిన వృద్ధుడు, ఆమె చెప్పిన యాప్‌లో పెట్టుబడులు పెట్టడం ప్రారంభించారు.

కొద్ది రోజులకే ఆయన ఖాతాలో రూ. 62.77 లక్షల లాభం వచ్చినట్టు యాప్‌లో కనిపించడంతో బాధితుడు ఆనందపడ్డారు. ఆ డబ్బును విత్‌డ్రా చేసుకునేందుకు ప్రయత్నించగా 'కన్వర్షన్ ఫీజు' చెల్లించాలంటూ మోసగాళ్లు కొత్త నాటకం మొదలుపెట్టారు. దాంతో బాధితుడు పలు దఫాలుగా దాదాపు రూ. 24.38 లక్షలను వారు చెప్పిన బ్యాంకు ఖాతాలకు బదిలీ చేశారు.

అయినప్పటికీ ఇంకా డబ్బు కావాలని వేధించడంతో ఆయనకు అనుమానం వచ్చింది. వారిని నిలదీయడంతో అటువైపు నుంచి ఫోన్ కట్ చేశారు. తాను మోసపోయానని గ్రహించిన బాధితుడు వెంటనే సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.


More Telugu News