శర్వానంద్ 'భోగి' ఫస్ట్ లుక్.. 'గంగ'గా మాస్ అవతారం

  • శర్వానంద్ పుట్టినరోజు సందర్భంగా 'భోగి' స్పెషల్ పోస్టర్ విడుదల
  • ఈ చిత్రంలో గంగ అనే పవర్ ఫుల్ పాత్రలో నటిస్తున్న శర్వా
  • 1960ల నాటి కథతో తెరకెక్కుతున్న పీరియాడిక్ యాక్షన్ డ్రామా
  • ఆగస్టు 28న పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానున్న చిత్రం
టాలీవుడ్ హీరో శర్వానంద్ పుట్టినరోజు సందర్భంగా ఆయన నటిస్తున్న తాజా చిత్రం 'భోగి' నుంచి మేకర్స్ ఆసక్తికరమైన అప్డేట్ ఇచ్చారు. సంపత్ నంది దర్శకత్వంలో శ్రీ సత్యసాయి ఆర్ట్స్ బ్యానర్‌పై తెరకెక్కుతున్న ఈ ఎక్స్ ప్లోజివ్ యాక్షన్ డ్రామా నుంచి శర్వానంద్ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు. ఇందులో శర్వా పోషిస్తున్న పాత్ర పేరు 'గంగ' అని వెల్లడించారు.

విడుదలైన పోస్టర్‌లో శర్వానంద్ మునుపెన్నడూ చూడని విధంగా ఊరమాస్ లుక్‌లో కనిపిస్తున్నారు. చెదిరిన జుట్టు, గుబురు గడ్డం, నోట్లో బీడీతో పూర్తి రగ్గడ్ లుక్‌లో దర్శనమిచ్చారు. చెమటతో కూడిన ముఖం, సీరియస్ చూపులతో శర్వా లుక్ చాలా ఇంటెన్స్‌గా ఉంది. "నిశ్శబ్దంలో పుట్టిన తుపాను.. బద్దలయ్యేందుకు సిద్ధంగా ఉన్న ఆగ్రహం.. త్వరలోనే ప్రపంచం అతడి ఉగ్రరూపాన్ని 'భోగి'లో చూస్తుంది" అంటూ చిత్రబృందం సోషల్ మీడియాలో పేర్కొంది.

1960ల చివరలో ఉత్తర తెలంగాణ - మహారాష్ట్ర సరిహద్దు నేపథ్యంలో సాగే పీరియాడిక్ కథాంశంతో దర్శకుడు సంపత్ నంది ఈ చిత్రాన్ని తీర్చిదిద్దుతున్నారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో వేసిన భారీ సెట్‌లో కీలక యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఈ చిత్రంలో అనుపమ పరమేశ్వరన్, డింపుల్ హయాతి హీరోయిన్లుగా నటిస్తున్నారు. 

భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తుండగా, కిరణ్ కుమార్ మన్నె ఆర్ట్ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు. ఆగస్టు 28న రాఖీ పండుగ కానుకగా తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ఈ సినిమాను పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేయనున్నట్లు నిర్మాతలు ప్రకటించారు.


More Telugu News