ఎనిమిది నెలలకే... లఢఖ్ లెఫ్టినెంట్ గవర్నర్ కవీందర్ గుప్తా రాజీనామా
- లద్దాఖ్ ఎల్జీ పదవికి కవీందర్ గుప్తా రాజీనామా
- బాధ్యతలు చేపట్టిన 8 నెలలకే గుడ్ బై
- రాష్ట్ర హోదా కోసం లద్దాఖ్ లో కొనసాగుతున్న ఆందోళనలు
- బుధవారం ప్రజల నుంచి నిరసన ఎదుర్కొన్న గుప్తా
- గతంలో జమ్ముకశ్మీర్ అసెంబ్లీ స్పీకర్ గా బాధ్యతలు
ప్రస్తుతం లఢఖ్ ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. లేహ్ అపెక్స్ బాడీ, కార్గిల్ డెమోక్రటిక్ అలయన్స్ వంటి పౌర సమాజ సంఘాలు లఢఖ్ కు రాష్ట్ర హోదా, ఆరో షెడ్యూల్ రక్షణలు, స్థానికులకు ఉద్యోగ రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తూ నిరసనలు చేపడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఆయన రాజీనామా ప్రాధాన్యత సంతరించుకుంది. మరోవైపు బుధవారం ఒక స్థానిక మొనాస్టరీని సందర్శించిన సమయంలో గుప్తా ప్రజల నుంచి తీవ్ర నిరసనను, ఆగ్రహాన్ని ఎదుర్కొన్నట్లు సమాచారం.
66 ఏళ్ల కవీందర్ గుప్తా చిన్ననాటి నుంచే రాజకీయాల్లో చురుకుగా ఉన్నారు. 13 ఏళ్ల వయసులో ఆర్ఎస్ఎస్ లో చేరిన ఆయన, ఎమర్జెన్సీ సమయంలో 13 నెలల పాటు జైలు శిక్ష అనుభవించారు. 2005 నుంచి 2010 వరకు రికార్డు స్థాయిలో మూడు పర్యాయాలు జమ్ము మేయర్ గా పనిచేశారు. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో గాంధీనగర్ నుంచి గెలుపొంది, 2015లో జమ్ముకశ్మీర్ అసెంబ్లీకి స్పీకర్ అయిన తొలి బీజేపీ నేతగా గుర్తింపు పొందారు.
2018 ఏప్రిల్ లో జమ్ముకశ్మీర్ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టిన గుప్తా, అప్పట్లో బీజేపీ-పీడీపీ కూటమి విచ్ఛిన్నం కావడంతో కేవలం 51 రోజులకే ఆ పదవికి రాజీనామా చేశారు. ఆ తర్వాత 2025 జూలైలో లఢఖ్ ఎల్జీగా నియమితులయ్యారు. తాజా పరిణామాలతో ఆయన మరోసారి స్వల్ప కాలంలోనే పదవిని వీడాల్సి వచ్చింది.