Stock Market: పశ్చిమాసియా పరిణామాలపై సానుకూల సంకేతాలు... భారీగా పుంజుకున్న స్టాక్ మార్కెట్

Stock Market Rises Positively Amid West Asia Developments
  • దేశీయ స్టాక్ మార్కెట్లలో నెలకొన్న సానుకూల పవనాలు
  • అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతలు తగ్గుతాయన్న సంకేతాలతో పుంజుకున్న సూచీలు
  • ఒక్కరోజే దాదాపు 900 పాయింట్లు లాభపడిన సెన్సెక్స్
  • భారీగా తగ్గిన ఇండియా విక్స్.. స్థిరపడిన మార్కెట్ సెంటిమెంట్
దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం నాడు భారీ లాభాలతో ముగిశాయి. అంతర్జాతీయంగా నెలకొన్న భయాలు సద్దుమణుగుతాయన్న సంకేతాలు కనిపించడంతో ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు మొగ్గుచూపారు. ఫలితంగా గత నెల రోజుల్లోనే బెంచ్‌మార్క్ సూచీలు గురువారం అత్యుత్తమ సెషన్‌ను నమోదు చేశాయి.

అమెరికా తమకు సరైన ప్రత్యామ్నాయ ప్రతిపాదనను చూపిస్తే.. తమ అణు కార్యక్రమాన్ని విరమించుకోవడానికి సిద్ధంగా ఉన్నట్లు ఇరాన్ సంకేతాలిచ్చినట్లు వార్తలు వచ్చాయి. దీంతో ఇన్నాళ్లుగా అమెరికా-ఇరాన్ మధ్య నెలకొన్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు తగ్గుముఖం పడతాయన్న ఆశలు మార్కెట్లకు బూస్ట్ ఇచ్చాయి.

మార్కెట్ ముగిసే సమయానికి నిఫ్టీ 285.40 పాయింట్లు లాభపడి 24,765.90 వద్ద స్థిరపడింది. అలాగే బాంబే స్టాక్ ఎక్స్చేంజి సూచీ సెన్సెక్స్ 899.71 పాయింట్లు ఎగబాకి 80,015.90 వద్ద ముగిసింది. అదానీ పోర్ట్స్, హిందాల్కో, ఎల్అండ్‌టీ షేర్లు నిఫ్టీలో టాప్ గెయినర్లుగా నిలిచాయి. మెటల్ రంగం 2.3 శాతం లాభపడగా, ఆయిల్ అండ్ గ్యాస్, నిర్మాణ రంగాలు కూడా రాణించాయి.

మరోవైపు మార్కెట్ ఒడిదుడుకులను సూచించే 'ఇండియా విక్స్' (India VIX) ఏకంగా 16 శాతం తగ్గి 18 పాయింట్ల దిగువకు చేరడం విశేషం. అయితే నిఫ్టీ 25,200 పాయింట్ల స్థాయిని దాటే వరకు దీనిని కేవలం 'పుల్ బ్యాక్' ర్యాలీగానే పరిగణించాలని మార్కెట్ నిపుణులు సూచిస్తున్నారు. దిగువన 24,600 పాయింట్ల వద్ద నిఫ్టీకి మద్దతు లభించే అవకాశం ఉందని విశ్లేషించారు. బెంచ్‌మార్క్ సూచీలతో పాటు మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ షేర్లు కూడా గురువారం మంచి లాభాలను ఆర్జించాయి.
Stock Market
Indian Stock Market
Sensex
Nifty
Share Market
Adani Ports
Hindalco
L&T
Iran Nuclear Program
West Asia

More Telugu News