Ambati Rambabu: అది ఒక కులంపై మరో కులం చేసిన దాడి: కాపు నేతల సమావేశంలో అంబటి రాంబాబు

Ambati Rambabu Attack on my house was an attack by one caste on another
  • కరణం ధర్మశ్రీ నివాసంలో కాపు నేతల బ్రేక్ ఫాస్ట్ మీటింగ్
  • తన ఇంటిపై దాడిని చంద్రబాబు, లోకేశ్ పర్యవేక్షించారన్న అంబటి
  • ఎర్ర బుక్కులకు భయపడేది లేదని వ్యాఖ్య

విశాఖపట్నంలో జరిగిన ఉమ్మడి విశాఖ జిల్లా వైసీపీ కాపు నేతల కీలక సమావేశంలో పాల్గొన్న మాజీ మంత్రి అంబటి రాంబాబు, కూటమి ప్రభుత్వంపై ముఖ్యంగా సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ లపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కరణం ధర్మశ్రీ నివాసంలో జరిగిన ఈ 'బ్రేక్ ఫాస్ట్ మీటింగ్'లో గుడివాడ అమర్నాథ్ వంటి కాపు నేతలతో కలిసి ప్రస్తుత రాజకీయ పరిణామాలు, అక్రమ కేసులు, అరెస్టులపై సుదీర్ఘంగా చర్చించారు.


అనంతరం మీడియాతో అంబటి రాంబాబు మాట్లాడుతూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. గుంటూరులోని తన నివాసంపై జరిగిన దాడిని స్వయంగా చంద్రబాబు, లోకేశ్ పర్యవేక్షించారని ఆయన ఆరోపించారు. టీవీ ఛానళ్లలో లైవ్ వస్తున్నా ప్రభుత్వం పట్టించుకోలేదని, పోలీసుల సమక్షంలోనే ఈ దౌర్జన్యం జరిగిందని మండిపడ్డారు. కేవలం దైవకృప వల్లే తాను ప్రాణాలతో బయటపడ్డానని అన్నారు.


ఈ దాడిని ఒక కులం మరో కులంపై చేసిన దాడిగా ఆయన అభివర్ణించారు. సమాజంలో కులాల మధ్య చిచ్చు పెట్టి ప్రభుత్వం ఏం సాధించాలనుకుంటోందని ప్రశ్నించారు. గతంలో వంగవీటి రంగాను కూడా పోలీసుల సహకారంతోనే చంపారని, ఇప్పుడు తన విషయంలోనూ అదే పునరావృతమవుతోందని ధ్వజమెత్తారు.


లోకేశ్ 'రెడ్ బుక్' బెదిరింపులకు తాము భయపడబోమని, అక్రమంగా తనను 18 రోజులు జైల్లో పెట్టారని గుర్తు చేశారు. తన జైలు శిక్ష సమయంలో ఉత్తరాంధ్ర నేతలు తన కుటుంబానికి అండగా నిలిచారని కృతజ్ఞతలు తెలిపారు. ఎర్ర బుక్కులు, పిచ్చి బుక్కులకు తాము భయపడబోమని చెప్పారు. కాపులను బీసీల్లో చేరుస్తామని గతంలో ఇచ్చిన హామీని చంద్రబాబు తుంగలో తొక్కారని, కాపుల కోసం ఉద్యమించిన ముద్రగడను వేధించారని విమర్శించారు. పవన్ కల్యాణ్ కూటమిలో ఉన్నంత మాత్రాన కాపులందరూ మీ వైపు ఉన్నారనుకోవడం భ్రమ అని ఆయన స్పష్టం చేశారు. చంద్రబాబు పతనం మొదలైందని, ఈ దాడులకు తగిన మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరించారు.

Ambati Rambabu
Chandrababu Naidu
Lokesh
Kapu community
Andhra Pradesh politics
Guntur attack
YS Jagan Mohan Reddy
Vangaveeti Ranga
Mudragada Padmanabham
Telugu Desam Party

More Telugu News