Ricky Ponting: ఇంగ్లాండ్‌తో టీమిండియా సెమీస్ .. కీలక వ్యాఖ్యలు చేసిన రికీ పాంటింగ్
- ఆందోళన కలిగిస్తున్న యువ ఓపెనర్ అభిషేక్ శర్మ ఫామ్
- ఫామ్‌లో లేనప్పుడు గంటల కొద్దీ నెట్స్‌లో సాధన చేయడం వేస్ట్ అన్న పాంటింగ్
- బౌలింగ్ లేదా ఫీల్డింగ్ ప్రాక్టీస్ చేయడం ద్వారా ఒత్తిడి తగ్గించుకోవచ్చని సూచన
ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా మరికొన్ని గంటల్లో జరగనున్న టీ20 ప్రపంచకప్ సెమీఫైనల్ పోరుపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగిన టీమ్ ఇండియా, వరుసగా మరోసారి ఫైనల్‌కు చేరడమే లక్ష్యంగా ఇంగ్లాండ్‌తో తలపడనుంది. ఈ కీలక మ్యాచ్‌లో గెలిచిన జట్టు ఫైనల్‌కు చేరుకుంటుంది, ఓడిన జట్టు టోర్నీ నుంచి నిష్క్రమిస్తుంది.
అయితే, ఈ కీలక సమరానికి ముందు టీమ్ ఇండియా యువ ఓపెనర్ అభిషేక్ శర్మ ఫామ్ జట్టు యాజమాన్యాన్ని కాస్త ఆందోళనకు గురిచేస్తోంది. ఈ టోర్నీలో ఆడిన 6 మ్యాచుల్లో అతను కేవలం 80 పరుగులు మాత్రమే చేశాడు. ఇందులో జింబాబ్వేపై చేసిన 55 పరుగులు మినహాయిస్తే, మిగతా మ్యాచుల్లో ఆశించిన స్థాయిలో రాణించలేకపోయాడు. ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా దిగ్గజ క్రికెటర్ రికీ పాంటింగ్ అభిషేక్ శర్మకు కొన్ని కీలక సూచనలు చేశాడు.
ఫామ్‌లో లేనప్పుడు గంటల కొద్దీ నెట్స్‌లో సాధన చేయడం కంటే, మానసికంగా దృఢంగా ఉండటానికి కొద్దిగా విరామం తీసుకోవడం ఉత్తమమని పాంటింగ్ అభిప్రాయపడ్డాడు. "నైపుణ్యాలు ఎక్కడికీ పోవు, బ్యాట్ పక్కన పెట్టి ఫీల్డింగ్ లేదా బౌలింగ్ ప్రాక్టీస్ చేయడం ద్వారా ఒత్తిడిని తగ్గించుకోవచ్చు" అని సూచించాడు. అభిషేక్ శర్మ తనదైన రోజున ఒంటిచేత్తో మ్యాచ్‌ను గెలిపించగల సత్తా ఉన్న ఆటగాడని, సెమీఫైనల్లో అతను కచ్చితంగా రాణిస్తాడని పాంటింగ్ ధీమా వ్యక్తం చేశాడు. ఒకవేళ అతడిని పక్కన పెట్టాలని భావిస్తే, మరో మ్యాచ్ విన్నర్ రింకు సింగ్‌ను జట్టులోకి తీసుకోవడం ద్వారా భారత్ తన బ్యాటింగ్ బలాన్ని కాపాడుకోవచ్చని ఆయన పేర్కొన్నాడు.