భారత విద్యార్థులకు కెనడా గుడ్ న్యూస్.. భారీ స్కాలర్‌షిప్‌లతో పాటు తిరుపతిలో క్యాంపస్

  • తిరుపతిలో డల్హౌసీ యూనివర్సిటీ గ్లోబల్ ఇన్నోవేషన్ క్యాంపస్ ఏర్పాటు
  • ఇరు దేశాల యూనివర్సిటీల మధ్య మొత్తం 13 కీలక ఒప్పందాలు
  • కెనడా ప్రధాని భారత పర్యటన అనంతరం ఈ కీలక నిర్ణయాలు
కెనడాలో ఉన్నత విద్య అభ్యసించాలనుకునే భారత విద్యార్థులకు ఆ దేశ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఇటీవల కెనడా ప్రధాని మార్క్ కార్నీ భారత పర్యటన ముగిసిన నేపథ్యంలో, ఇరు దేశాల మధ్య సంబంధాలను బలోపేతం చేసే దిశగా కీలక ప్రకటనలు వెలువడ్డాయి. ఇందులో భాగంగా ప్రతిభావంతులైన భారత విద్యార్థులకు భారీగా స్కాలర్‌షిప్‌లు అందించడంతో పాటు, ఇరు దేశాల విశ్వవిద్యాలయాల మధ్య భాగస్వామ్యాలను పెంపొందించాలని నిర్ణయించారు. 

పరిశోధన, హైబ్రిడ్ క్యాంపస్‌లు, ఏఐ కేంద్రాల ఏర్పాటు కోసం ఇరుదేశాల యూనివర్సిటీల మధ్య మొత్తం 13 ఒప్పందాలు జరిగినట్లు కెనడా తెలిపింది. కెనడాలోని ప్రఖ్యాత యూనివర్సిటీ ఆఫ్ టొరంటో, విద్యార్థుల కోసం ప్రత్యేకంగా 25 మిలియన్ డాలర్ల నిధితో 220కి పైగా విద్యార్ధులకు స్కాలర్‌షిప్‌లు అందించనున్నట్లు ప్రకటించింది. ఈ ఒప్పందాల్లో భాగంగా ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతికి చెందిన ఐఐటీ, ఐసర్‌లతో కలిసి కెనడాకు చెందిన డల్హౌసీ యూనివర్సిటీ ఒక ఇన్నోవేషన్ క్యాంపస్‌ను ఏర్పాటు చేయనుంది. 

భారత్‌తో ద్వైపాక్షిక, విద్యా సంబంధాలను బలోపేతం చేసుకోవడమే లక్ష్యంగా ఈ నిర్ణయాలు తీసుకున్నట్లు కెనడా ప్రధాని కార్యాలయం స్పష్టం చేసింది. తమ ఇండో-పసిఫిక్ వ్యూహంలో భాగంగా పది మిలియన్ డాలర్లతో స్కాలర్ షిప్‌లు అందిస్తామని కెనడా వెల్లడించింది. భారత్‌లోని ప్రముఖ విశ్వవిద్యాలయాల్లో పరిశోధనలకు 85 మంది కెనడా విద్యార్ధులకు తోడ్పాటు అందిస్తామని తెలిపింది. అర్హులైన విద్యార్ధులకు ట్యూషన్ ఫీజులు, ఇతర ఖర్చులన్నీ భరించనున్నట్లు సమాచారం. ఈ స్కాలర్‌షిప్‌లకు సంబంధించిన అర్హతలు, దరఖాస్తుల వివరాలను యూనివర్సిటీ ఆఫ్ టోరెంటో త్వరలోనే వెల్లడించే అవకాశం ఉంది. 


More Telugu News