తిరుమలలో పట్టు శాలువాల స్కామ్ ఎఫెక్ట్.. టీటీడీ కీలక నిర్ణయం

  • ఆప్కో, కోఆప్టెక్స్‌ల నుంచి వస్త్రాలు కొనుగోలుకు గ్రీన్ సిగ్నల్
  • రూ.43 కోట్ల విలువైన వస్త్రాలను 50:50 నిష్పత్తిలో సేకరణ
  • సరఫరాలో అంతరాయం లేకుండా మల్టీ వెండార్ విధానం అమలు
  • కొనుగోళ్లలో పారదర్శకత, నాణ్యతకు పెద్దపీట వేసిన టీటీడీ
తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) వస్త్రాల కొనుగోలు విధానంలో కీల‌క‌ నిర్ణయం తీసుకుంది. గతేడాది వెలుగులోకి వచ్చిన పట్టు శాలువాల కుంభకోణం నేపథ్యంలో ఇకపై కొనుగోళ్లలో పూర్తి పారదర్శకత పాటించాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా ప్రభుత్వ రంగ సంస్థలైన ఆప్కో (ఆంధ్రప్రదేశ్), కోఆప్టెక్స్ (తమిళనాడు) నుంచి వస్త్రాలను సేకరించాలని తీర్మానించింది. మొత్తం రూ.43 కోట్ల విలువైన చీరలు, శాలువాలు, ఇతర వస్త్ర సామగ్రిని ఈ రెండు సంస్థల నుంచి 50:50 నిష్పత్తిలో కొనుగోలు చేయనుంది.

సరఫరాలో ఎలాంటి అంతరాయాలు లేదా ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకే ఈ మల్టీ వెండార్ విధానాన్ని ఎంచుకున్నట్లు టీటీడీ స్పష్టం చేసింది. టీటీడీ ఏఈవో వెంకయ్య చౌదరి ఇటీవల ఆప్కో, కోఆప్టెక్స్ ప్రతినిధులతో ప్రత్యేకంగా సమావేశమై చర్చలు జరిపారు. టీటీడీ నిర్దేశించిన నాణ్యతా ప్రమాణాలతో వస్త్రాలను సరఫరా చేసేందుకు ఈ రెండు సంస్థలు అంగీకారం తెలిపాయి. ఈ నిర్ణయంతో ఇకపై స్వామివారికి, అమ్మవార్లకు అవసరమైన వస్త్రాలన్నీ ప్రభుత్వ ఆధ్వర్యంలోని చేనేత సహకార సంఘాల నుంచే రానున్నాయి.

గతేడాది టీటీడీలో పట్టు శాలువాల కుంభకోణం తీవ్ర చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. మల్బరీ పట్టు శాలువాల కోసం ఆర్డర్ ఇస్తే, ఓ ప్రైవేట్ సరఫరాదారు వాటికి బదులుగా నాసిరకం పాలిస్టర్ శాలువాలను సరఫరా చేసినట్లు టీటీడీ గుర్తించింది. సుమారు రూ.350 నుంచి రూ.400 విలువ చేసే శాలువాను ఏకంగా రూ.1,389 చొప్పున 2015 నుంచి కొనుగోలు చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ వ్యవహారంపై టీటీడీ అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ)కి ఫిర్యాదు చేయడంతో కుంభకోణం వెలుగులోకి వచ్చింది. ఈ పరిణామాల నేపథ్యంలోనే టీటీడీ భవిష్యత్తులో ఇలాంటి పొరపాట్లకు తావు లేకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టింది.

కాగా, టీటీడీకి ఏటా భారీ మొత్తంలో వస్త్రాలు అవసరమవుతాయి. తిరుమల శ్రీవారి ఆలయానికి ఏటా దాదాపు 65 స్వచ్ఛమైన జరీ మేల్‌చాట్, ఉత్తరీయం సెట్లు, 1,080 పట్టు చీరలు అవసరం. అలాగే టీటీడీ పరిధిలోని ఇతర ఆలయాలకు 320 మేల్‌చాట్ సెట్లు, వందల సంఖ్యలో పట్టు చీరలు కావాలి. వీటికి అదనంగా ఏటా 36 వేల పట్టు శాలువాలు, 60 వేల పాలిస్టర్ శాలువాలు, 10.8 లక్షల కాటన్ వస్త్రాలు, 9 లక్షల కాటన్ బ్లౌజ్ పీసులు కూడా టీటీడీ సేకరిస్తుంది. ఈ భారీ అవసరాలన్నింటినీ ఇకపై ఆప్కో, కోఆప్టెక్స్‌లు సంయుక్తంగా తీర్చనున్నాయి.


More Telugu News