APSDMA: ఏపీకి ఎండల హెచ్చరిక .. ఈసారి వేసవి మరింత తీవ్రం!

APSDMA warns of severe summer heatwave in Andhra Pradesh
  • గత ఏడాదితో పోలిస్తే కొత్త రికార్డులు నమోదయ్యే అవకాశం
  • మార్చి నుంచే పలు జిల్లాల్లో సాధారణం కంటే అధిక ఉష్ణోగ్రతలు
  • గుంటూరు, పల్నాడు, కర్నూలు సహా పలు జిల్లాల్లో తీవ్ర వడగాలుల ముప్పు
  • ప్రాణ నష్టం నివారణకు ముందస్తు చర్యలు చేపట్టిన విపత్తుల సంస్థ
రాష్ట్రంలో ఎండలు క్రమంగా పెరుగుతున్న నేపథ్యంలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ (ఏపీఎస్‌డీఎంఏ) కీలక హెచ్చరిక జారీ చేసింది. ఈ ఏడాది వేసవి తీవ్రత గతం కంటే ఎక్కువగా ఉంటుందని, కొన్ని ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు కొత్త రికార్డులు సృష్టించే అవకాశం ఉందని అంచనా వేసింది. ఈ మేరకు ఏపీఎస్డీఎంఏ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ వివరాలు వెల్లడించారు. 

విపత్తుల నిర్వహణ సంస్థ అంచనాల ప్రకారం..ఈ మార్చి నెల నుంచే సాధారణం కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యే సూచనలు ఉన్నాయి. ముఖ్యంగా శ్రీకాకుళం, ప్రకాశం, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీసత్యసాయి, అన్నమయ్య, కడప జిల్లాల్లో అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది. అలాగే కృష్ణా, గుంటూరు, బాపట్ల, పల్నాడు, మార్కాపురం జిల్లాల్లో ఎక్కువ రోజుల పాటు వడగాలులు వీచే ప్రమాదం ఉందని హెచ్చరించింది.
 
మార్చి నుంచి మే నెలల మధ్య కాలంలో శ్రీకాకుళం, ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, మార్కాపురం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, సత్యసాయి, అన్నమయ్య, కడప, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లోని కొన్నిప్రాంతాలు మినహా మిగిలిన ప్రదేశాల్లో సాధారణం కంటే ఎక్కువ స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదు అయ్యే అవకాశం ఉందని తెలిపింది. గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, మార్కాపురం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల జిల్లాల్లో  తీవ్రమైన వడగాలులు వీస్తాయని సంస్థ అంచనా వేస్తోంది.
 
పెరుగుతున్న ఎండల తీవ్రత దృష్ట్యా ఎలాంటి ప్రాణ నష్టం జరగకుండా ముందస్తు చర్యలు చేపడుతున్నామని ఎండీ ప్రఖర్ జైన్ వివరించారు. జిల్లా యంత్రాంగాలతో సమన్వయం చేసుకుంటూ, ఎప్పటికప్పుడు ప్రజలకు హెచ్చరికలు జారీ చేయడం ద్వారా ప్రాణనష్టాన్ని నివారించగలమని ఆయన తెలిపారు. ఎండల తీవ్రత, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సమాచారం కోసం ప్రజలు టోల్ ఫ్రీ నంబర్లు 112, 1070, 18004250101లను సంప్రదించాలని సూచించారు.
 
APSDMA
Andhra Pradesh heatwave
heatwave warning
Prachar Jain
AP weather
summer heat
heatwave forecast
India heatwave
high temperatures
weather forecast

More Telugu News