Bombay High Court: వాట్సాప్ చాట్ ఆధారంగా విడాకులు.. బాంబే హైకోర్టు కీలక వ్యాఖ్యలు

Bombay High Court Says Divorce Cannot Be Granted Based Solely on WhatsApp Chats
  • భార్య నుండి విడాకులు ఇప్పించాలంటూ నాసిక్ ఫ్యామిలీ కోర్టుకు భర్త
  • వాట్సాప్ ఆధారాలను పరిగణలోకి తీసుకుని భర్తకు అనుకూలంగా కోర్టు తీర్పు
  • బాంబే హైకోర్టులో సవాల్ చేసిన భార్య
  • వాట్సాప్ ఆధారంగా విడాకులు మంజూరు చేయలేమని బాంబే హైకోర్టు వ్యాఖ్య
వాట్సాప్ చాట్‌ల ఆధారంగా విడాకులు మంజూరు చేయలేమని బాంబే హైకోర్టు స్పష్టం చేసింది. భార్య నుంచి విడాకులు కోరుతూ ఒక వ్యక్తి గతంలో నాసిక్ ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించాడు. భార్య చేసిన వాట్సాప్ చాట్‌ వివరాలను కోర్టుకు సమర్పించాడు. అందులో... కాపురాన్ని నాసిక్ నుంచి పుణేకు మార్చాలని డిమాండ్ చేసిందని, అత్త, వదినలపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిందని పేర్కొన్నాడు.

భర్త సమర్పించిన వాట్సాప్ చాటింగ్‌ను ఆధారాలుగా తీసుకున్న నాసిక్ కోర్టు భర్త విడాకులు పొందడానికి అర్హుడని తెలిపింది. వాట్సాప్ చాటింగ్ ద్వారా భర్తపై భార్య ఒత్తిడి తెచ్చినట్లు, ఎమోషనల్ బ్లాక్ మెయిల్‌కు పాల్పడినట్లు కోర్టు తెలిపింది. ఈ క్రమంలో విడాకులు తీసుకోవచ్చని నాసిక్ కోర్టు తెలిపింది.

దీనిని భార్య బాంబే హైకోర్టులో సవాల్ చేసింది. ఈ కేసులో తన వాదనలు వినిపించుకునే అవకాశం కింది కోర్టు ఇవ్వలేదని పేర్కొంది. నాసిక్ కోర్టు ఉత్తర్వులు ఏకపక్షమని తెలిపింది. ఆమె పిటిషన్‌పై విచారణ జరిపిన బాంబే హైకోర్టు నాసిక్ ఫ్యామిలీ కోర్టు ఇచ్చిన తీర్పును కొట్టివేసింది.

కేవలం వాట్సాప్ చాట్ ఆధారంగా విడాకులు మంజూరు చేయలేమని కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ కేసును మళ్లీ విచారించాలని నాసిక్ ఫ్యామిలీ కోర్టుకు తిప్పి పంపించింది. భార్యకు వాదనలు వినిపించడానికి, సాక్ష్యాలు సమర్పించడానికి అవకాశం ఇవ్వాలని ఆదేశించింది. అదే సమయలో ఈ జంట తిరిగి కలిసి ఉండేందుకు మధ్యవర్తిత్వం అవకాశాలను కూడా పరిశీలించాలని సూచించింది.
Bombay High Court
Divorce
WhatsApp Chat
Nasik Family Court
Family Law
Emotional Blackmail

More Telugu News