రికార్డుల మోత మోగిస్తున్న టీ20 వరల్డ్ కప్.. 50 కోట్లు దాటిన వ్యూయర్‌షిప్

  • చరిత్ర సృష్టించిన టీ20 ప్రపంచకప్ 2026
  • భారత్‌లోనే 50 కోట్లు దాటిన వీక్షకుల సంఖ్య
  • రికార్డులపై బీసీసీఐ కార్యదర్శి జై షా హర్షం
ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026 సరికొత్త చరిత్ర సృష్టించింది. టోర్నమెంట్ చరిత్రలోనే అత్యధిక వ్యూయర్‌షిప్ సాధించిన ఎడిషన్‌గా రికార్డులకెక్కింది. కేవలం భారత్‌లోనే ఈ టోర్నమెంట్‌ను వీక్షించిన వారి సంఖ్య 50 కోట్లు దాటడం విశేషం. ఇది టీ20 ప్రపంచకప్ చరిత్రలోనే అత్యధికం.

ఈ విషయాన్ని బీసీసీఐ కార్యదర్శి జై షా 'ఎక్స్' వేదికగా వెల్లడించారు. ఈ టోర్నమెంట్‌ను ప్రపంచవ్యాప్తంగా మరింత విస్తృతం చేయాలనే లక్ష్యంతో ప్రారంభించామని, భారత్‌లో 50 కోట్ల వ్యూయర్‌షిప్ దాటడం ఎంతో సంతోషంగా ఉందని తెలిపారు. అదే సమయంలో జియో హాట్‌స్టార్‌లో ఒకేసారి 6.05 కోట్ల మంది వీక్షించడం అద్భుతమని పేర్కొన్నారు. నాకౌట్ మ్యాచ్‌లు ప్రారంభమైన నేపథ్యంలో భారత అభిమానుల ప్రేమతో మరిన్ని రికార్డులు బద్దలవుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు.

వ్యూయర్‌షిప్‌లోనే కాదు, మైదానంలోనూ ఈ టోర్నీ హోరాహోరీగా సాగుతోంది. 20 జట్లతో ప్రారంభమైన గ్రూప్ స్టేజ్‌లో ఆస్ట్రేలియా, పాకిస్థాన్ వంటి బలమైన జట్లకు గట్టి పోటీ ఎదురైంది. మరోవైపు జింబాబ్వే, నేపాల్ వంటి జట్లు అద్భుతమైన ప్రదర్శనతో ఆకట్టుకున్నాయి. సూపర్ 8 దశలో పోటీ మరింత తీవ్రమైంది. ఉత్కంఠభరితమైన మ్యాచ్‌ల అనంతరం నెట్ రన్‌రేట్ ఆధారంగా భారత్, ఇంగ్లండ్, న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా జట్లు సెమీ ఫైనల్‌కు అర్హత సాధించాయి.

సెమీ ఫైనల్స్‌లో భాగంగా ముంబైలోని వాంఖడే స్టేడియంలో భారత్, ఇంగ్లండ్ మధ్య హోరాహోరీ పోరు జరగనుంది. మరో సెమీస్‌లో కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా తలపడనున్నాయి.

ఇక‌, ఐసీసీ అధికారిక స్ట్రీమింగ్ సర్వీస్ ఐసీసీ.టీవీ కూడా కొత్త రికార్డులు సృష్టించింది. 2024 ఎడిషన్‌తో పోలిస్తే వినియోగదారులు 28 శాతం, వీక్షణ సమయం 56 శాతం పెరిగింది. సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌లో వీడియో వ్యూస్ ఇప్పటికే 10 బిలియన్లు దాటాయి.




More Telugu News