ఆల్ టైమ్ రికార్డు తిరగరాసిన భారత్, వెస్టిండీస్ సూపర్-8 మ్యాచ్

  • భారత్ - వెస్టిండీస్ సూపర్ 8 మ్యాచ్‌కు రికార్డు స్థాయి డిజిటల్ వ్యూయర్‌షిప్
  • 2024 టీ20 వరల్డ్ కప్ ఫైనల్ రికార్డును బద్దలు కొట్టిన తాజా మ్యాచ్
  • ఐసీసీ డిజిటల్ ప్లాట్‌ఫామ్స్‌లో 56 శాతం పెరిగిన వాచ్ టైమ్
  • జర్మనీ, ఇటలీ, జపాన్ వంటి దేశాల్లోనూ క్రికెట్‌కు పెరుగుతున్న ఆదరణ
ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026 డిజిటల్ ప్లాట్‌ఫామ్స్‌లో సరికొత్త చరిత్ర సృష్టిస్తోంది. ముఖ్యంగా భారత్, వెస్టిండీస్ జట్ల మధ్య జరిగిన సూపర్ 8 మ్యాచ్ లైవ్ స్ట్రీమింగ్‌లో ఆల్ టైమ్ రికార్డులను తిరగరాసింది. గత 2024 ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్ సమయంలో నమోదైన అత్యధిక కాంకరెంట్ వ్యూస్ (ఒకేసారి చూసేవారి సంఖ్య) రికార్డును... ఈ ఇండియా-వెస్టిండీస్ మ్యాచ్ అధిగమించడం విశేషం.

ప్రస్తుతం జరుగుతున్న ఈ మెగా టోర్నీ డిజిటల్ ఎంగేజ్‌మెంట్‌లో మునుపెన్నడూ లేని విధంగా దూసుకుపోతోంది. ఐసీసీ.టీవీ (ICC.tv)లో ఇప్పటికే 2024 పూర్తి టోర్నీ గణాంకాలను మించి వ్యూస్ నమోదయ్యాయి. గత టోర్నీతో ఇదే సమయానికి పోల్చి చూస్తే.. యూనిక్ యూజర్లు 28 శాతం పెరగ్గా, మొత్తం వాచ్ టైమ్ 56 శాతం వృద్ధి చెందింది. ఇక సోషల్ మీడియాలో ఐసీసీ వీడియో వ్యూస్ ఇప్పటికే 10 బిలియన్ల మార్కును దాటాయి. సగటున ఒక్కో యూజర్ మ్యాచ్ చూసే సమయం కూడా గతంలో 47 నిమిషాలు ఉండగా, ఇప్పుడు అది 58 నిమిషాలకు పెరిగింది.

ముఖ్యంగా ఇంగ్లీష్ యేతర భాషల ఫీడ్స్‌కు అద్భుతమైన స్పందన లభిస్తోంది. మొత్తం ప్లే-టైమ్‌లో సగం వాటా హిందీ, ఉర్దూ, నేపాలీ, జపనీస్ వంటి ఇతర భాషలదే కావడం గమనార్హం. ఇక క్రికెట్‌కు కొత్తగా పరిచయమవుతున్న దేశాల్లో (నాన్-ట్రెడిషనల్ మార్కెట్స్) ఆదరణ భారీగా పెరిగింది. జర్మనీలో 150 శాతం, ఇటలీలో 136 శాతం, జపాన్, దక్షిణ కొరియాల్లో 100 శాతానికి పైగా వ్యూయర్‌షిప్ పెరిగింది. క్రికెట్‌ను విశ్వవ్యాప్తం చేయాలన్న ఐసీసీ లక్ష్యం దిశగా ఈ గణాంకాలు సానుకూల సంకేతాలను ఇస్తున్నాయి.


More Telugu News