'పెద్ది'పై ఆ వదంతులను నమ్మొద్దు.. క్లారిటీ ఇచ్చిన మేక‌ర్స్

  • 'పెద్ది' సినిమా రన్‌టైమ్‌పై వస్తున్న వదంతులను నమ్మవద్దన్న చిత్ర బృందం
  • ప్రస్తుతం సెకండాఫ్ షూటింగ్, ఎడిటింగ్ పనులు వేగంగా జరుగుతున్నాయని వెల్లడి
  • విడుదలైన రామ్ చరణ్ ఇంట్రో సాంగ్ 'రై రై రా రా'కు అద్భుత స్పందన
  • ఏప్రిల్ 30న సినిమా విడుదల ఖాయమని మరోసారి స్పష్టీకరణ
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, దర్శకుడు బుచ్చిబాబు సానా కాంబినేషన్‌లో ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రం 'పెద్ది'. ఈ సినిమా ఫైనల్ రన్‌టైమ్‌కు సంబంధించి సోషల్ మీడియాలో వస్తున్న పుకార్లను నమ్మవద్దని చిత్ర బృందం అభిమానులకు విజ్ఞప్తి చేసింది. ముందుగా ప్రకటించినట్లే ఏప్రిల్ 30న సినిమాను గ్రాండ్‌గా విడుదల చేయడానికి అంతా సజావుగా సాగుతోందని స్పష్టం చేసింది.

ఈ విషయంపై పబ్లిసిస్ట్ వంశీ శేఖర్ 'ఎక్స్' వేదికగా స్పందించారు. "'పెద్ది' రన్‌టైమ్‌పై ఆన్‌లైన్‌లో సర్క్యులేట్ అవుతున్న ఎలాంటి వదంతులను నమ్మకండి. సినిమా ఫస్ట్ హాఫ్ మాత్రమే లాక్ అయింది. ఏఆర్ రెహమాన్ అందిస్తున్న నేపథ్య సంగీతం కూడా పూర్తయ్యే దశలో ఉంది. సెకండాఫ్ ప్రస్తుతం చివరి దశ షూటింగ్‌లో ఉండగా, ఎడిటింగ్ పనులు కూడా ఏకకాలంలో వేగంగా జరుగుతున్నాయి. త్వరలోనే అవీ పూర్తవుతాయి" అని ఆయన తెలిపారు.

ఇదిలా ఉంటే.. కొద్ది గంటల క్రితం ఈ సినిమా నుంచి రామ్ చరణ్ ఇంట్రో సాంగ్ 'రై రై రా రా'ను విడుదల చేయగా, దీనికి అద్భుతమైన స్పందన లభిస్తోంది. ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ అందించిన ఈ ఫుల్ థ్రాటిల్ డ్యాన్స్ నంబర్‌ను ఆయనే స్వయంగా ఆలపించడం విశేషం. రామ్ చరణ్ తనదైన మాస్ ఎనర్జీ, గ్రేస్‌ఫుల్ స్టెప్పులతో అభిమానులకు విజువల్ ట్రీట్ ఇచ్చారు. జానీ మాస్టర్ కొరియోగ్రఫీ, అనంత శ్రీరామ్ సాహిత్యం పాటకు మరింత ఊపునిచ్చాయి.

వృద్ధి సినిమాస్ పతాకంపై వెంకట సతీశ్‌ కిలారు నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పిస్తున్నాయి. ఈ సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తుండగా, శివ రాజ్‌కుమార్, జగపతి బాబు, బోమన్ ఇరానీ కీలక పాత్రలు పోషిస్తున్నారు. 


More Telugu News