సంజూకు రోహిత్ మద్దతు.. ఆ మాటలే నిజమయ్యాయి!

  • వెస్టిండీస్‌పై మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్‌తో చెలరేగిన సంజూ శాంసన్
  • టోర్నీ ఆరంభంలో 'దిగులు పడొద్దు' అంటూ సంజూకు రోహిత్ భరోసా
  • ఐసీసీ షేర్ చేయడంతో వైరల్ అయిన రోహిత్, సంజూ సంభాషణ
టీమిండియా వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ కెరీర్ ప్రయాణం ఒక రోలర్‌కోస్టర్ రైడ్‌ను తలపిస్తుంది. తాజాగా వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో 97 పరుగులతో అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడి జట్టుకు చారిత్రక విజయాన్ని అందించిన శాంసన్ వెనుక, మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ ఇచ్చిన భరోసా ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. టోర్నమెంట్ ఆరంభంలో జట్టులో చోటు దక్కక నిరాశలో ఉన్న సంజూకు రోహిత్ ధైర్యం చెబుతున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఈ ప్రపంచకప్ టోర్నమెంట్‌కు ముందు దాదాపు ఏడాది పాటు టీ20ల్లో భారత జట్టుకు ఫస్ట్ ఛాయిస్ ఓపెనర్‌గా ఉన్నప్పటికీ, టోర్నీ ప్రారంభమయ్యేసరికి ఇషాన్ కిషన్ అద్భుత ఫామ్‌లో ఉండటంతో సంజూ శాంసన్ తుది జట్టులో స్థానం కోల్పోయాడు. జట్టులో చోటు దక్కని సంజూ ఒంటరిగా కూర్చుని ఉండగా, కెప్టెన్ రోహిత్ శర్మ అతని వద్దకు వెళ్లి మాట్లాడాడు. అమెరికాతో జరిగిన తొలి మ్యాచ్‌కు ముందు ముంబైలోని వాంఖడే స్టేడియంలో ప్రాక్టీస్ సెషన్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. 

"కైసా హై? దుఖీ మత్ హో భాయ్. ఇట్ ఈజ్ ఏ లాంగ్ టోర్నమెంట్, కభీ భీ మౌకా ఆ సక్తా హై" (ఎలా ఉన్నావ్? దిగులు పడొద్దు బ్ర‌ద‌ర్‌. ఇది చాలా పెద్ద టోర్నమెంట్. అవకాశం ఎప్పుడైనా రావచ్చు) అని రోహిత్ ధైర్యం చెప్పాడు. ఈ సంభాషణకు సంబంధించిన వీడియోను ఐసీసీ తన అధికారిక ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేయడంతో ఇది అందరి దృష్టిని ఆకర్షించింది.

రోహిత్ శర్మ మాటలు అక్షరాలా నిజమయ్యాయి. దక్షిణాఫ్రికాతో ఓటమి తర్వాత సంజూకు జట్టులోకి తిరిగి వచ్చే అవకాశం లభించింది. జింబాబ్వేపై చిన్నదైనా కీలకమైన ఇన్నింగ్స్ ఆడిన అతను, వెస్టిండీస్‌పై తన విశ్వరూపం ప్రదర్శించాడు. ఈ మ్యాచ్‌లో అద్భుతమైన ఇన్నింగ్స్‌తో టీ20 ప్రపంచకప్ చరిత్రలోనే టీమిండియాకు అత్యధిక విజయవంతమైన ఛేజింగ్‌ను అందించాడు.

రోహిత్, కోహ్లీల నుంచి ఎంతో నేర్చుకున్నానన్న శాంసన్
మ్యాచ్ అనంతరం సంజూ మాట్లాడుతూ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీల నుంచి ఎంతో నేర్చుకున్నానని తెలిపాడు. "గత 10-12 ఏళ్లుగా ఐపీఎల్ ఆడుతున్నాను. పదేళ్లుగా భారత జట్టుతో ఉంటున్నాను. నాకు ఎప్పుడూ ఆడే అవకాశం రాకపోయినా, డగౌట్ నుంచి విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ వంటి దిగ్గజాలను గమనిస్తూ ఎంతో నేర్చుకున్నాను. వారు ఏం చేస్తున్నారో చూడటం, నేర్చుకోవడం చాలా ముఖ్యం" అని శాంసన్ వివరించాడు. మొత్తం మీద సీనియర్ ఆటగాడి భరోసా, తనపై తనకు ఉన్న నమ్మకంతో సంజూ అద్భుతమైన పునరాగమనం చేసి అందరి ప్రశంసలు అందుకుంటున్నాడు.


More Telugu News