ప్రియుడిని హత్య చేసిన టీవీ నటి.. 12 రోజుల తర్వాత వెలుగులోకి దారుణం

  • ప్రియుడిని దారుణంగా హత్య చేసిన టీవీ నటి ఊర్మిళ
  • పెళ్లికి అడ్డుగా ఉన్నాడనే కారణంతో ఈ ఘాతుకం
  • పార్టీ పేరుతో మద్యం తాగించి దారుణంగా హత్య
  • నటితో పాటు మరో ఇద్దరిని అరెస్ట్ చేసిన పోలీసులు
బెంగళూరులో దారుణం వెలుగు చూసింది. తన పెళ్లికి అడ్డు వస్తున్నాడన్న కారణంతో ఓ టీవీ నటి తన ప్రియుడిని హత్య చేసింది. ఈ హత్య జరిగిన 12 రోజుల తర్వాత ఆలస్యంగా వెలుగులోకి రావడం కలకలం రేపుతోంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, ఈ ఘటన బెంగళూరులోని మంజునాథనగర్‌లో చోటుచేసుకుంది. 

వివరాల్లోకి వెళితే.. టీవీ నటి ఊర్మిళ అలియాస్ బిందు, మోహన్ కృష్ణారావు (40) కొంతకాలంగా 'లివ్-ఇన్' రిలేషన్‌షిప్‌లో ఉన్నారు. అయితే ఇటీవల బిందు, లారీ డ్రైవర్ అయిన వినయ్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంది. ఈ పెళ్లికి మోహన్ కృష్ణారావు  అడ్డు చెప్పడంతో అతడిని ఎలాగైనా అడ్డు తొలగించుకోవాలని బిందు ప్లాన్ వేసింది. 

పథకం ప్రకారం, ఫిబ్రవరి 18న మోహన్‌తో కలిసి ఉంటున్న ఇంట్లోనే బిందు ఓ పార్టీ ఏర్పాటు చేసింది. పార్టీలో మోహన్‌కు ఫుల్లుగా మద్యం తాగించారు. ఆ తర్వాత వినయ్, అతడి స్నేహితుడు ధనుష్‌తో కలిసి మోహన్‌పై దాడి చేశారు. అతడి కాళ్లు, చేతులు కట్టేసి, నోటికి, ముక్కుకు టేపులు చుట్టారు. అనంతరం కత్తితో పలుమార్లు పొడవడంతో ఊపిరాడక మోహన్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. హత్య తర్వాత నిందితులు అక్కడి నుంచి పరారయ్యారు.

హత్య జరిగిన 12 రోజుల తర్వాత ఆ ఇంటి నుంచి తీవ్రమైన దుర్వాసన రావడంతో ఇరుగుపొరుగు వారు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, కుళ్లిపోయిన స్థితిలో ఉన్న మోహన్ మృతదేహాన్ని గుర్తించారు. ఈ కేసులో నటి బిందుతో పాటు వినయ్, ధనుష్‌లను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ నేరంలో ఎవరి పాత్ర ఎంత ఉందనే దానిపై విచారణ జరుపుతున్నట్లు నార్త్-వెస్ట్ డీసీపీ డీల్ నాగేష్ తెలిపారు. కాగా, బిందు 'భజరంగి', 'పోలీస్ క్వార్టర్స్', 'కాలభైరవ' వంటి చిత్రాల్లో చిన్న పాత్రల్లో నటించింది.


More Telugu News