Amberpet Suicide Case: ఇటీవల ఒకే కుటుంబంలో ముగ్గురి ఆత్మహత్య... వడ్డీవ్యాపారుల అరెస్ట్

Amberpet Suicide Case Four Arrested in Hyderabad Family Suicide
  • అంబర్‌పేట సామూహిక ఆత్మహత్యల కేసులో నలుగురు అరెస్ట్
  • వడ్డీ వ్యాపారుల వేధింపులే కారణమని తేల్చిన పోలీసులు
  • రూ. 57 లక్షల అప్పు విషయంలో తీవ్ర ఒత్తిడి, అవమానాలు
  • సూసైడ్ నోట్స్, ఫోన్ కాల్ డేటా ఆధారంగా నిందితుల గుర్తింపు
  • ఖాళీ చెక్కులు, ప్రామిసరీ నోట్లు స్వాధీనం చేసుకున్న పోలీసులు
హైదరాబాద్ అంబర్‌పేట బాపూనగర్‌లో ఇటీవల చోటుచేసుకున్న విషాద ఘటనలో, వడ్డీ వ్యాపారుల వేధింపులు తాళలేక ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఆత్మహత్య చేసుకున్న కేసులో పోలీసులు నలుగురు నిందితులను సోమవారం అరెస్ట్ చేశారు. ఫిబ్రవరి 24న కాడ్గేకర్ రామరాజ్ (54), ఆయన భార్య మాధవి, సోదరుడు కాడ్గేకర్ శశాంక్ రాజ్ తమ ఇంట్లో విగతజీవులుగా కనిపించిన విషయం తెలిసిందే.

ఘటనా స్థలంలో లభించిన సూసైడ్ నోట్స్, కుటుంబ సభ్యుల వాంగ్మూలాల ఆధారంగా పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. కింగ్స్ బిర్యానీ హోటల్ నిర్వహణ కోసం మృతులు నిందితుల వద్ద రూ. 57 లక్షల అప్పు తీసుకున్నారు. అయితే, నిందితులు అధిక వడ్డీలు వసూలు చేయడమే కాకుండా.. ఖాళీ చెక్కులు, ప్రామిసరీ నోట్లు, భూమి పత్రాలను బలవంతంగా తీసుకున్నారని డీసీపీ తెలిపారు.

డబ్బులు తిరిగి చెల్లించాలని నిందితులు ఫోన్లలో అసభ్యంగా మాట్లాడటం, ఇంటికి వచ్చి బహిరంగంగా అవమానిస్తామని బెదిరించడం వంటి చర్యలకు పాల్పడ్డారు. ఆత్మహత్యకు ముందు రోజు రాత్రి (ఫిబ్రవరి 23) కూడా నిందితులు ఫోన్ చేసి డబ్బులు కట్టకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించినట్లు కాల్ డేటా ద్వారా పోలీసులు నిర్ధారించారు. ఈ కేసును బిఎన్‌ఎస్ సెక్షన్ 108 (ఆత్మహత్యకు ప్రేరేపించడం) కింద మార్చి దర్యాప్తు చేశారు.

అరెస్టయిన వారిని ఇర్ఫాన్ అలియాస్ మహ్మద్ వాసి ఉజ్ జమాన్, పి. రాజశేఖర రెడ్డి, మహ్మద్ నవాజ్, సయ్యద్ మజీద్ హైదర్‌గా గుర్తించారు. విచారణలో తాము అధిక వడ్డీలకు అప్పులిచ్చామని, వసూళ్ల కోసం కుటుంబ సభ్యులను తీవ్ర ఒత్తిడి చేశామని, పత్రాలను తమ వద్దే ఉంచుకున్నామని నిందితులు అంగీకరించారు. నిరంతర వేధింపులు, అవమానాలు తట్టుకోలేకే ఆ కుటుంబం ఆత్మహత్య చేసుకుందని పోలీసులు స్పష్టం చేశారు.

Amberpet Suicide Case
Hyderabad
Suicide
Usury
Loan Harassment
Bapunagar
Irfaan
Police Investigation
Debt

More Telugu News