ఆ మూడు యుద్ధ విమానాలను కువైట్ పొరపాటున కూల్చింది: అమెరికా ప్రకటన

  • కువైట్ గగనతలంలో పొరపాటున అమెరికా విమానాల కూల్చివేత
  • ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీలో పాల్గొన్న మూడు ఎఫ్-15 విమానాలు ధ్వంసం
  • ఇరాన్ దాడుల సమయంలో శత్రువులుగా భావించి కాల్పులు
  • ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడ్డ ఆరుగురు సిబ్బంది
కువైట్ గగనతలంలో అనూహ్య ఘటన చోటుచేసుకుంది. ఇరాన్ పై ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీలో భాగంగా విధులు నిర్వర్తిస్తున్న మూడు అమెరికా ఎఫ్-15ఈ స్ట్రైక్ ఈగల్ యుద్ధ విమానాలు కుప్పకూలాయి. ఈ విమానాలను తామే కూల్చామని ఇరాన్ ఇప్పటికే ప్రకటించింది. అయితే ఇవి శత్రువుల దాడిలో కూలిపోలేదని.. మిత్రదేశమైన కువైట్ ఎయిర్ డిఫెన్స్ దళాలే వీటిని పొరపాటున కూల్చేశాయని అమెరికా సైన్యం ఓ ప్రకటన చేసింది. ఈ విషయాన్ని అమెరికా సెంట్రల్ కమాండ్ అధికారికంగా ధృవీకరించింది.

అమెరికా కాలమానం ప్రకారం మార్చి 1వ తేదీ రాత్రి 11:03 గంటల సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఆ సమయంలో ఇరాన్ నుంచి యుద్ధ విమానాలు, డ్రోన్లు, బాలిస్టిక్ క్షిపణులతో దాడులు జరుగుతున్నాయి. ఈ తీవ్ర ఉద్రిక్తతల నడుమ.. అమెరికా విమానాలను శత్రువుల విమానాలుగా పొరబడిన కువైట్ బలగాలు కాల్పులు జరపడంతో అవి కూలిపోయాయి. దీన్నే సైనిక పరిభాషలో 'ఫ్రెండ్లీ ఫైర్' అంటారు.

అదృష్టవశాత్తు మూడు విమానాల్లోని మొత్తం ఆరుగురు పైలెట్లు (ఎయిర్ క్రూ) పారాచూట్ల ద్వారా సురక్షితంగా కిందకు దిగారు. వారిని వెంటనే రక్షించామని, ప్రస్తుతం వారంతా ఆరోగ్యంగా ఉన్నారని అధికారులు తెలిపారు. ఈ ఘటనపై కువైట్ స్పందించిందని.. ఇది పొరపాటున జరిగిన చర్యగా అంగీకరించిందని యూఎస్ సెంట్రల్ కమాండ్ వెల్లడించింది. ఈ క్లిష్ట సమయంలో కువైట్ రక్షణ దళాలు అందిస్తున్న సహకారానికి కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు అమెరికా పేర్కొంది. ఘటనకు దారితీసిన పూర్తి కారణాలపై దర్యాప్తు జరుగుతోంది.


More Telugu News