రెండు వైపులా దెబ్బ... పాకిస్థాన్ స్టాక్ మార్కెట్ కుదేల్

  • భారీగా నష్టపోయిన పాకిస్థాన్ స్టాక్ మార్కెట్
  • అమెరికా-ఇరాన్ యుద్ధం నేపథ్యంలో పాక్‌లో అల్లర్లు
  • కరాచీలోని అమెరికా కాన్సులేట్ వద్ద కాల్పులు, 12 మంది మృతి
  • అఫ్ఘానిస్థాన్‌తో కాల్పుల విరమణ రద్దు చేసుకున్న పాక్
  • భారీ నష్టాల్లో ముగిసిన భారత స్టాక్ మార్కెట్లు
ఓవైపు అమెరికా-ఇరాన్ మధ్య చెలరేగిన యుద్ధం, మరోవైపు అఫ్ఘానిస్థాన్‌తో సరిహద్దు ఘర్షణల నేపథ్యంలో పాకిస్థాన్ స్టాక్ మార్కెట్ సోమవారం కుప్పకూలింది. అంతర్జాతీయ ఉద్రిక్తతలు, దేశీయంగా చెలరేగిన అల్లర్లతో మదుపర్లు భయందోళనకు గురవడంతో పాకిస్థాన్ బెంచ్‌మార్క్ కేఎస్ఈ-100 సూచీ దాదాపు 10 శాతం మేర పతనం అయ్యింది.

మార్కెట్ ఆరంభంలోనే భారీ అమ్మకాలతో సూచీలు నేలచూపులు చూశాయి. మధ్యాహ్న సమయానికి కేఎస్ఈ-100 సూచీ 151,798 పాయింట్ల వద్ద ట్రేడ్ అవుతూ 9.68 శాతం నష్టపోయింది. అమ్మకాల ఒత్తిడి తీవ్రం కావడంతో ఒక గంట పాటు ట్రేడింగ్‌ను నిలిపివేయాల్సి వచ్చింది. ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీని అమెరికా-ఇజ్రాయెల్ దళాలు వైమానిక దాడుల్లో హతమార్చడంతో పాకిస్థాన్‌లో ఆగ్రహజ్వాలలు ఎగిసిపడ్డాయి. కరాచీలోని అమెరికా కాన్సులేట్ వద్ద ఆందోళనకారులు విధ్వంసానికి దిగారు. అక్కడ భద్రతగా ఉన్న అమెరికా మెరైన్ సిబ్బంది జరిపిన కాల్పుల్లో 12 మంది నిరసనకారులు మృతి చెందగా, దేశవ్యాప్తంగా జరిగిన అల్లర్లలో మొత్తం 35 మంది ప్రాణాలు కోల్పోయినట్లు స్థానిక మీడియా పేర్కొంది.

మరోవైపు అఫ్ఘానిస్థాన్‌ తాలిబన్లతో ఉన్న కాల్పుల విరమణ ఒప్పందం రద్దయ్యింది. కాబూల్‌పై పాక్ ఓపెన్ వార్ ప్రకటించడంతో పరిస్థితులు మరింత విషమించాయి. ఈ పరిణామాలపై పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ అత్యవసర ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు.

ఈ ఉద్రిక్తతల ప్రభావం ఆసియా పసిఫిక్ మార్కెట్లపైనా తీవ్రంగా పడింది. భారత స్టాక్ మార్కెట్లు కూడా భారీ నష్టాలను చవిచూశాయి. సెన్సెక్స్ 1.29 శాతం (1,048 పాయింట్లు) నష్టపోయి 80,238 వద్ద, నిఫ్టీ 1.24 శాతం (312 పాయింట్లు) నష్టపోయి 24,865 వద్ద ముగిశాయి. 2025 సెప్టెంబర్ తర్వాత మార్కెట్లు ఇంతలా పతనం కావడం ఇదే తొలిసారి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ సైనిక చర్య మరో నాలుగు వారాలు సాగొచ్చని సంకేతాలు ఇవ్వడంతో ఇన్వెస్టర్లలో ఆందోళన నెలకొంది.


More Telugu News