దుబాయ్ లో చిక్కుకుపోయిన తుమ్మల నాగేశ్వరరావు.. క్షేమంగా ఉన్నానని వెల్లడి

  • దుబాయ్‌పై క్షిపణులు ప్రయోగించిన ఇరాన్
  • దుబాయ్ విమానాశ్రయంలో రాకపోకలు బంద్
  • బంధువుని పరామర్శించేందుకు దుబాయ్ వెళ్లిన తుమ్మల

అమెరికా, ఇజ్రాయెల్ - ఇరాన్ మధ్య రేగిన భీకర పోరు ప్రపంచ దేశాల్లో ఆందోళన కలిగిస్తోంది. ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ మృతికి ప్రతీకారంగా ఇరాన్ క్షిపణులతో విరుచుకుపడుతుండటంతో గల్ఫ్ దేశాలన్నీ యుద్ధ క్షేత్రాలుగా మారాయి. ఈ అనూహ్య పరిణామాల నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు దుబాయ్‌లో చిక్కుకుపోయారు. తన కుటుంబ సభ్యుల్లో ఒకరు అనారోగ్యానికి గురి కావడంతో వారిని పరామర్శించేందుకు ఐదు రోజుల క్రితమే ఆయన దుబాయ్ వెళ్లారు. 


అయితే ఇరాన్ తన క్షిపణి దాడుల లక్ష్యాన్ని యూఏఈ, కువైట్, ఖతార్ వంటి దేశాల్లోని అమెరికా సైనిక స్థావరాలు, విమానాశ్రయాల వైపు మళ్లించడంతో అక్కడ యుద్ధ వాతావరణం నెలకొంది. భద్రతా కారణాల దృష్ట్యా దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని అక్కడి ప్రభుత్వం తాత్కాలికంగా మూసివేయడంతో పాటు అన్ని విమాన సర్వీసులను రద్దు చేసింది. ప్రస్తుతం దుబాయ్‌పై ఇరాన్ దాడుల నేపథ్యంలో అక్కడి జనజీవనం పూర్తిగా స్థంభించిపోయింది.


విమానాల రాకపోకలు నిలిచిపోవడంతో తుమ్మల నాగేశ్వరరావు తన కుటుంబంతో కలిసి అక్కడే ఉండిపోవాల్సి వచ్చింది. ప్రస్తుతం ఆయన సురక్షితంగానే ఉన్నప్పటికీ, విమానాశ్రయ అధికారులు క్లియరెన్స్ ఇచ్చే వరకు స్వదేశానికి తిరిగి రావడం సాధ్యం కాదని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో తుమ్మల స్పందిస్తూ... తాను సురక్షితంగానే ఉన్నానని తెలిపారు. విమాన సర్వీసులు ప్రారంభమైన వెంటనే హైదరాబాద్ కు బయల్దేరుతానని చెప్పారు.



More Telugu News