Ali Khamenei: ఖమేని మృతి.. అన్ని రాష్ట్రాలను హైఅలర్ట్ చేసిన కేంద్రం

Ali Khamenei Death Central Govt Alerts All States
  • ఖమేనీ మృతి నేపథ్యంలో దేశంలో పలుచోట్ల నిరసన కార్యక్రమాలు
  • ప్రార్థనా స్థలాల్లో రెచ్చగొట్టే ప్రసంగాలు చేసే అవకాశం ఉందన్న కేంద్రం
  • సున్నితమైన ప్రాంతాల్లో నిఘా కట్టుదిట్టం చేయాలని ఆదేశం

పశ్చిమాసియాలో ఇజ్రాయెల్, అమెరికా - ఇరాన్ మధ్య రేగిన యుద్ధ సెగలు ఇప్పుడు అంతర్జాతీయ సరిహద్దులు దాటి ఇండియాను కూడా తాకుతున్నాయి. ఇరాన్ అత్యున్నత ఆధ్యాత్మిక నేత అయతొల్లా అలీ ఖమేనీ మృతి నేపథ్యంలో భారత్ లో కూడా కొన్ని చోట్ల నిరసన కార్యక్రమాలను చేపట్టారు. ఈ పరిణామాల నేపథ్యంలో దేశీయంగా శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలను హై అలర్ట్ చేసింది.


ముఖ్యంగా ఇరాన్ అనుకూల రాడికల్ శక్తులు మతపరమైన ప్రార్థనా స్థలాలు లేదా బహిరంగ సభలను వేదికగా చేసుకుని రెచ్చగొట్టే ప్రసంగాలు చేసే ప్రమాదం ఉందని నిఘా వర్గాలు హెచ్చరించాయి. దీంతో కేంద్ర హోం శాఖ అన్ని రాష్ట్రాల పోలీసు విభాగాలకు అత్యవసర లేఖలు పంపింది. మతపరమైన ఉద్రిక్తతలు తలెత్తకుండా గూఢచారి విభాగాల మధ్య సమాచార మార్పిడిని వేగవంతం చేయాలని, సున్నితమైన ప్రాంతాల్లో నిఘా కట్టుదిట్టం చేయాలని ఆదేశించింది.


ఖమేనీ మృతికి నిరసనగా ఇప్పటికే ఢిల్లీ, లక్నో, శ్రీనగర్ వంటి నగరాల్లో భారీ ఎత్తున నిరసన ప్రదర్శనలు జరిగాయి. ఈ ఆందోళనలను అదునుగా తీసుకుని అరాచక శక్తులు హింసకు ప్రేరేపించే అవకాశం ఉందని ప్రభుత్వం భావిస్తోంది. ఈ క్రమంలోనే పశ్చిమాసియాలో మారుతున్న సమీకరణాలను ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. గత రాత్రి ఆయన నేతృత్వంలో జరిగిన భద్రతా వ్యవహారాల క్యాబినెట్ కమిటీ సమావేశంలో ప్రస్తుత యుద్ధ వాతావరణంపై లోతైన సమీక్ష నిర్వహించారు.

Ali Khamenei
Iran
India
Israel
America
High Alert
Protests
Security
Middle East
Narendra Modi

More Telugu News