అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతలు.. పరుగులు పెట్టిన బంగారం

  • మధ్యప్రాచ్యంలో యుద్ధ మేఘాలు.. భగ్గుమన్న బంగారం
  • ఇవాళ‌ ఒక్కరోజే 3 శాతానికి పైగా పెరిగిన పసిడి, వెండి ధరలు
  • 10 గ్రాముల బంగారం రూ.1,67,155.. కేజీ వెండి రూ.2,91,249కి చేరిక
  • ఇరాన్ సుప్రీం లీడర్ మృతితో తీవ్రమైన ఉద్రిక్తతలు
  • 7 శాతానికి పైగా ఎగబాకిన ముడి చమురు ధరలు
మధ్యప్రాచ్యంలో అమెరికా-ఇరాన్ మధ్య యుద్ధ ఉద్రిక్తతలు తీవ్రరూపం దాల్చడంతో ఇవాళ‌ బంగారం, వెండి ధరలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి. సురక్షిత పెట్టుబడిగా భావించే పసిడికి డిమాండ్ భారీగా పెరగడంతో ధరలు 3 శాతానికి పైగా ఎగబాకాయి.

వివరాల్లోకి వెళితే... ఎంసీఎక్స్ గోల్డ్ ఏప్రిల్ ఫ్యూచర్స్ 3.12 శాతం పెరిగి 10 గ్రాముల ధర రూ.1,67,155కు చేరింది. అలాగే, ఎంసీఎక్స్ సిల్వర్ మార్చి ఫ్యూచర్స్ 3.04 శాతం లాభపడి కిలో ధర రూ.2,91,249కి ఎగబాకింది.

అమెరికా-ఇజ్రాయెల్ సంయుక్తంగా జరిపిన దాడుల్లో ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖొమేనీ మరణించడంతో పరిస్థితి మరింత తీవ్రంగా మారింది. దీనికి ముందు ఇరాన్‌లోని కమాండ్ సెంటర్లపై ఇజ్రాయెల్ దాడులు చేయడం, ప్రతిగా గల్ఫ్‌లోని అమెరికా స్థావరాలపై ఇరాన్ క్షిపణి దాడులకు దిగడంతో యుద్ధ వాతావరణం నెలకొంది. ఈ పరిణామాలతో పెట్టుబడిదారులు రిస్క్ తీసుకోవడానికి వెనుకాడటంతో సురక్షిత పెట్టుబడిగా పసిడి వైపు మొగ్గు చూపారు.

ఈ పరిణామాలపై మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ అనలిస్ట్ మానవ్ మోదీ స్పందిస్తూ.. అమెరికా-ఇరాన్ యుద్ధ భయాలు, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ టారిఫ్‌లపై కొనసాగుతున్న అనిశ్చితి వంటివి బంగారం ధరల పెరుగుదలకు కారణమయ్యాయని తెలిపారు. మరోవైపు డాలర్ ఇండెక్స్ బలపడటం బంగారం ధరల పెరుగుదలకు కొంత కళ్లెం వేసింది. యుద్ధ భయాలతో ముడి చమురు ధరలు కూడా 7 శాతానికి పైగా పెరిగాయి. ప్రస్తుతం మదుపరులు కీలక దేశాల మాన్యుఫ్యాక్చరింగ్ పీఎంఐ, అమెరికా లేబర్ మార్కెట్ గణాంకాల కోసం ఎదురుచూస్తున్నారు.


More Telugu News