Iran: ఇరాన్‌పై పోరులో తొలిసారిగా అమెరికాకు ప్రాణనష్టం... ముగ్గురు సైనికుల మృతి

Iran US Conflict US Suffers Casualties in Iran Operation
  • తీవ్ర గాయాలతో చికిత్స పొందుతున్న ఐదుగురు సైనికులు
  • యూఎస్ఎస్ అబ్రహం లింకన్‌పై దాడి వార్తలను ఖండించిన అమెరికా
  • కొనసాగుతున్న మేజర్ కంబాట్ ఆపరేషన్స్
  • ఇప్పటికే దాడుల్లో మరణించిన ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ
ఇరాన్‌పై అమెరికా చేపట్టిన 'ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ'లో తొలిసారిగా అగ్రరాజ్యానికి ప్రాణనష్టం చోటుచేసుకుంది. ఈ ఆపరేషన్‌లో తమ దేశానికి చెందిన ముగ్గురు సర్వీస్ మెంబర్స్ (సైనికులు) మరణించారని, మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారని యూఎస్ సెంట్రల్ కమాండ్ (CENTCOM) ఆదివారం అధికారికంగా ప్రకటించింది.

ప్రస్తుతం అక్కడ మేజర్ కంబాట్ ఆపరేషన్స్ (భారీ స్థాయి యుద్ధ చర్యలు) కొనసాగుతున్నాయని, పరిస్థితి ఇంకా ఉద్రిక్తంగానే ఉందని అధికారులు తెలిపారు. మరణించిన వారి కుటుంబాలకు సమాచారం అందించిన 24 గంటల తర్వాతే వారి వివరాలను వెల్లడిస్తామని సైన్యం స్పష్టం చేసింది. మరికొందరు సైనికులు స్వల్ప గాయాలతో బయటపడ్డారని, వారికి చికిత్స అందించి తిరిగి విధుల్లోకి తీసుకుంటామని పేర్కొంది. ఇరాన్ మిలిటరీ, సెక్యూరిటీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ను లక్ష్యంగా చేసుకుని అమెరికా ఈ ఆపరేషన్‌ను ప్రారంభించిన విషయం తెలిసిందే.

మరోవైపు, తమ యుద్ధ నౌక 'యూఎస్ఎస్ అబ్రహం లింకన్'పై ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ బాలిస్టిక్ క్షిపణులతో దాడి చేశారన్న వార్తలను సెంట్రల్ కమాండ్ తీవ్రంగా ఖండించింది. ఇరాన్ క్షిపణులు తమ నౌక దరిదాపుల్లోకి కూడా రాలేదని, ఆ వార్తలు పచ్చి అబద్ధమని కొట్టిపారేసింది. అబ్రహం లింకన్ నౌక సురక్షితంగా ఉందని, ఇరాన్ ముప్పును ఎదుర్కోవడంలో కీలక పాత్ర పోషిస్తోందని స్పష్టం చేసింది.

ఇప్పటికే అమెరికా జరిపిన వైమానిక దాడుల్లో ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీతో పాటు ఆ దేశ అగ్రనేతలు మరణించిన నేపథ్యంలో.. తాజా పరిణామాలు వాషింగ్టన్‌లోనూ చర్చనీయాంశంగా మారాయి. సైనికుల మరణాలతో ఈ ఆపరేషన్ లక్ష్యాలు, కాలపరిమితిపై అమెరికా చట్టసభ సభ్యులు ఆరా తీస్తున్నారు.
Iran
US Central Command
CENTCOM
Operation Epic Fury
US Military
Abraham Lincoln
Ayatollah Ali Khamenei
Iran Revolutionary Guard
Ballistic Missiles

More Telugu News