చరిత్రలో ఎన్నడూ చూడని దాడులు తప్పవన్న ఐఆర్‌జీసీ

  • ఖమేనీ మృతికి ప్రతీకారం తీర్చుకుంటామని వెల్లడి
  • అమెరికా, ఇజ్రాయెల్ స్థావరాలే లక్ష్యంగా భారీ ఆపరేషన్‌!
  • ఐఆర్‌జీసీ కొత్త కమాండర్‌గా అహ్మద్ వాహిదీ..
ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ మరణాన్ని ఆ దేశం అత్యంత తీవ్రంగా పరిగణించింది. అమెరికా-ఇజ్రాయెల్ జరిపిన సంయుక్త దాడుల్లో తమ అత్యున్నత నేత ప్రాణాలు కోల్పోవడంపై ఇరాన్ కేబినెట్ ఆదివారం అత్యవసరంగా సమావేశమైంది. ఈ ‘‘ఘోరమైన నేరానికి’’ కచ్చితంగా బదులు తీర్చుకుంటామని, శత్రువులకు ఊహించని రీతిలో బుద్ధి చెబుతామని ఇరాన్ ప్రభుత్వం హెచ్చరించింది.

వరుస దాడులకు ఐఆర్‌జీసీ సిద్ధం..
ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ (ఐఆర్‌జీసీ) తమ సుప్రీం నేత మృతికి సంతాపం ప్రకటిస్తూనే, యుద్ధానికి సిద్ధమవ్వాలని పిలుపునిచ్చింది. ‘‘చరిత్రలో ఎన్నడూ చూడని అత్యంత భయంకరమైన దాడులు ఏ క్షణమైనా జరగొచ్చు’’ అని ఐఆర్‌జీసీ హెచ్చరించింది. ఇజ్రాయెల్ భూభాగంతో పాటు, మధ్యప్రాచ్యంలో ఉన్న అమెరికా సైనిక స్థావరాలనే లక్ష్యంగా చేసుకుని భారీ ఆపరేషన్ చేపట్టేందుకు ప్రణాళికలు సిద్ధం చేసినట్లు ఇరాన్ మీడియా వెల్లడించింది.

కొత్త కమాండర్ నియామకం..
ఈ దాడుల్లో కేవలం ఖమేనీ మాత్రమే కాకుండా, ఆయన అత్యంత నమ్మకస్తులైన సలహాదారు అలీ షంఖానీ మరియు ఐఆర్‌జీసీ గ్రౌండ్ ఫోర్స్ చీఫ్ మహమ్మద్ పాక్‌పౌర్ కూడా మరణించినట్లు ఇరాన్ తాజాగా ధృవీకరించింది. కీలక నేతలందరినీ ఒకేసారి కోల్పోవడంతో ఇరాన్ రక్షణ వ్యవస్థలో పెను మార్పులు చేపట్టింది. ఐఆర్‌జీసీ కొత్త కమాండర్-ఇన్-చీఫ్‌గా మాజీ రక్షణ మంత్రి అహ్మద్ వాహిదీని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం ఇరాన్ సరిహద్దుల్లో యుద్ధ ట్యాంకులు, క్షిపణి వ్యవస్థలు భారీగా మోహరించాయి. ఏ క్షణంలోనైనా గల్ఫ్ ప్రాంతం మరో భారీ యుద్ధానికి సాక్షిగా మారే అవకాశం కనిపిస్తోంది.


More Telugu News