Satish Chandra Gupta: హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ఫ్రాడ్ కేసులో ఆస్తుల అటాచ్

Satish Chandra Gupta Real Estate Fraud Assets Attached by ED
  • సాయి సూర్య డెవలపర్స్‌కు చెందిన రూ.14.63 కోట్ల ఆస్తుల అటాచ్
  • ప్లాట్ల పేరుతో కస్టమర్లను మోసం చేసినట్లు ఆరోపణలు
  • కుటుంబ సభ్యుల ఖాతాల్లోకి భారీగా నిధుల మళ్లింపు
  • అనుమతి లేని లేవుట్లలో ప్లాట్ల విక్రయాలు
  • మనీలాండరింగ్ చట్టం కింద దర్యాప్తు కొనసాగిస్తున్న ఈడీ
ప్లాట్ల పేరుతో సామాన్యులను మోసగించిన కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) హైదరాబాద్ జోనల్ అధికారులు కీలక చర్యలు తీసుకున్నారు. 'సాయి సూర్య డెవలపర్స్' సంస్థకు చెందిన రూ.14.63 కోట్ల విలువైన స్థిరాస్తులను మనీలాండరింగ్ నిరోధక చట్టం 2002 కింద తాత్కాలికంగా అటాచ్ చేశారు. ఈ ఆస్తుల్లో సంస్థ పేరుతో రిజిస్టర్ అయి ఉన్న పలు భూములు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు.

సాయి సూర్య డెవలపర్స్ ప్రొప్రైటర్ సతీష్ చంద్ర గుప్తా, మరికొందరిపై తెలంగాణ పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈడీ దర్యాప్తు ప్రారంభించింది. నిందితులు ప్రజల నుంచి డబ్బు వసూలు చేసి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేయకుండా మోసం చేశారని పోలీసుల చార్జిషీట్‌లో పేర్కొన్నారు. ఈడీ దర్యాప్తులో మరిన్ని సంచలన విషయాలు వెలుగుచూశాయి. సతీష్ చంద్ర గుప్తా, ఆయన అనుచరులు అనుమతులు లేని లేవుట్లను చూపించి, ఒకే ప్లాట్‌ను వేర్వేరు వ్యక్తులకు విక్రయించినట్లు తేలింది. సరైన ఒప్పందాలు లేకుండానే బాధితుల నుంచి భారీగా నగదు వసూలు చేశారు.

బాధితుల నుంచి చెక్కులు, బ్యాంక్ ట్రాన్స్‌ఫర్లు, నగదు రూపంలో సేకరించిన మొత్తాన్ని నిందితులు దారి మళ్లించారు. ఈ నిధులను నేరుగా కాకుండా.. తమ కుటుంబ సభ్యులు, బినామీ సంస్థల పేర్లతో ఉన్న అనేక బ్యాంక్ ఖాతాల్లోకి మళ్లించి (లేయరింగ్) మనీలాండరింగ్‌కు పాల్పడినట్లు ఈడీ గుర్తించింది. ఇలా అక్రమంగా ఆర్జించిన రూ.14.63 కోట్ల విలువైన ఆస్తులను ప్రస్తుతం ఈడీ జప్తు చేసింది.

రియల్ ఎస్టేట్ రంగంలో జరుగుతున్న మోసాలను అరికట్టడంలో భాగంగా ఈ చర్యలు తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. మోసపోయిన మదుపరుల ప్రయోజనాలను కాపాడటమే లక్ష్యంగా దర్యాప్తు కొనసాగుతోందని, ఈ నెట్‌వర్క్‌లో ఇంకా ఎవరెవరి ప్రమేయం ఉందనే కోణంలో విచారణ జరుపుతున్నామని ఈడీ వర్గాలు వెల్లడించాయి.
Satish Chandra Gupta
Hyderabad real estate fraud
Sai Surya Developers
Enforcement Directorate ED
money laundering
property attachment
real estate investments
Telangana police
illegal layouts
property registration

More Telugu News