శత్రువులు తమ దాడులకు చింతించేలా బదులిస్తాం: ఇజ్రాయెల్-అమెరికా దాడులపై ఇరాన్ స్పందన

  • అమెరికా, ఇజ్రాయెల్ దాడులపై ఇరాన్ తీవ్ర ఆగ్రహం
  • ఆక్రమణదారులకు తగిన గుణపాఠం చెబుతామని హెచ్చరిక
  • చర్చలు జరుగుతుండగానే దాడులు చేయడం సరికాదని వ్యాఖ్య
  • ఐక్యరాజ్యసమితి వెంటనే జోక్యం చేసుకోవాలని విజ్ఞప్తి
  • దేశ రక్షణ కోసం పూర్తి బలంతో విరుచుకుపడతామని స్పష్టీకరణ
అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా నిర్వహించిన వైమానిక దాడులపై ఇరాన్ తీవ్రంగా స్పందించింది. తమ దేశ సార్వభౌమాధికారంపై జరిగిన ఈ దాడికి అధికారం, బలంతోనే సమాధానం చెబుతామని ఇరాన్ విదేశాంగ శాఖ శనివారం ఒక ప్రకటనలో హెచ్చరించింది. ఆక్రమణదారులకు తగిన గుణపాఠం చెప్పేందుకు తమ సైన్యం సిద్ధంగా ఉందని స్పష్టం చేసింది. తాజా దాడులతో మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు ఒక్కసారిగా పెరిగాయి.

పవిత్ర రంజాన్ మాసం, నౌరోజ్ పండుగ సమయంలో అమెరికా, ఇజ్రాయెల్ దళాలు తమ దేశంలోని రక్షణ, పౌర ప్రాంతాలపై దాడులు చేయడాన్ని ఇరాన్ తీవ్రంగా ఖండించింది. ఇదొక క్రిమినల్ చర్య అని, అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘించడమేనని మండిపడింది. దౌత్యపరమైన చర్చల ద్వారా సమస్య పరిష్కారానికి తాము ప్రయత్నిస్తుండగానే.. ఇలా దొంగచాటుగా దాడులు చేయడం పిరికిపంద చర్య అని ఇరాన్ విదేశాంగ శాఖ పేర్కొంది. యుద్ధాన్ని నివారించేందుకు తాము అన్ని ప్రయత్నాలు చేశామని, ఇక దేశ రక్షణే తమ ముందున్న ఏకైక మార్గమని తెలిపింది.

ఐక్యరాజ్యసమితి చార్టర్ ఆర్టికల్ 51 ప్రకారం.. తమ దేశాన్ని రక్షించుకునే చట్టబద్ధమైన హక్కు తమకు ఉందని ఇరాన్ తెలిపింది. శత్రువుల దుశ్చర్యలను తిప్పికొట్టేందుకు తమ సాయుధ దళాలు పూర్తి సామర్థ్యంతో సన్నద్ధంగా ఉన్నాయని వెల్లడించింది. ఈ దాడుల వల్ల ప్రపంచ శాంతికి ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని, వెంటనే ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి, ఇస్లామిక్ దేశాలు ఈ చర్యను ఖండించి, తగిన చర్యలు తీసుకోవాలని ఇరాన్ విజ్ఞప్తి చేసింది. 

చరిత్రలో ఇరాన్ ప్రజలు ఎప్పుడూ విదేశీ ఆక్రమణలకు తలొగ్గలేదని, ఈసారి కూడా శత్రువులు తమ చర్యలకు చింతించేలా బదులిస్తామని హెచ్చరించింది. కాగా, ఇరాన్ కూడా ఇజ్రాయెల్ పై బాలిస్టిక్ క్షిపణులతో దాడులు చేసినట్లు ఇజ్రాయెల్ సైన్యం ధృవీకరించింది.


More Telugu News