తుపాకీ శిక్షణలో కిమ్ కూతురు.. ఉత్తర కొరియా తదుపరి బాస్ ఈమేనా..!

  • రైఫిల్‌ తో గురిచూస్తున్న కిమ్ కుమార్తె ఫొటోలు విడుదల చేసిన ప్రభుత్వం
  • జూ యే కు వారసత్వ శిక్షణ మొదలైందంటున్న దక్షిణ కొరియా నిఘా సంస్థలు
  • సోదరికి పార్టీలో కీలక పదవి కట్టబెట్టిన ఉత్తర కొరియా నియంత
ఉత్తర కొరియాలో కిమ్ జోంగ్ ఉన్ వారసత్వంపై ఇటీవలి కాలంలో చర్చ జరుగుతున్న విషయం తెలిసిందే. నియంత కిమ్ తర్వాత పాలనా బాధ్యతలను ఆయన కూతురు జూ యే చేపడతారని ప్రచారం జరుగుతోంది. కొంతకాలంగా అధికారిక కార్యక్రమాలకు కిమ్ తన వెంట కూతురును కూడా తీసుకు వెళుతున్నారు. ఈ నేపథ్యంలో తన వారసురాలిగా తీర్చిదిద్దేందుకు జూ యే కు కిమ్ శిక్షణనిస్తున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా ఉత్తరకొరియా అధికారిక న్యూస్ ఏజెన్సీ విడుదల చేసిన ఓ ఫొటో అంతర్జాతీయంగా చర్చనీయాంశంగా మారింది. 

జూ యే తన తండ్రి కిమ్ అడుగుజాడల్లో నడుస్తూ, ప్రొఫెషనల్ షూటర్ లాగా జూ యే రైఫిల్ పట్టుకుని గురిచూస్తున్నట్లు  ఈ ఫొటోలో కనిపిస్తోంది. ఉత్తర కొరియా అధికారిక వార్తా సంస్థ శనివారం ఈ ఫొటోలను విడుదల చేసింది. అందులో జూ యే ఒక అవుట్‌డోర్ షూటింగ్ రేంజ్‌లో, స్కోప్ ద్వారా గురి చూస్తూ తుపాకీని పేలుస్తున్న దృశ్యాలు ఉన్నాయి. తుపాకీ గొట్టం నుంచి పొగ వస్తున్నట్లు ఉన్న ఈ ఫొటోలు ఆమెకు ఆయుధాల వాడకంలో శిక్షణనిస్తున్నట్లు స్పష్టం చేస్తున్నాయి. విశేషమేమిటంటే, కిమ్ జోంగ్ ఉన్ తరచుగా ధరించే లెదర్ జాకెట్‌నే జూ యే కూడా ధరించింది. ఇది ఆ దేశంలో అధికారం మరియు వారసత్వానికి చిహ్నంగా పరిగణిస్తారు.

వారసురాలిగా ఖరారు..

దక్షిణ కొరియా నిఘా సంస్థల అంచనా ప్రకారం.. కిమ్ తన కుమార్తెను వారసురాలిగా ప్రకటించే ప్రక్రియను ఇప్పటికే ప్రారంభించారు. ‘‘కేవలం క్షిపణి ప్రయోగాలు చూడటమే కాకుండా, స్వయంగా ఆయుధాన్ని వాడటం అనేది ఆమెకు ఒక పాలకురాలికి ఉండాల్సిన లక్షణాలను నేర్పిస్తున్నారని అర్థం’’ అని రక్షణ నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఈ వారం జరిగిన పార్టీ కాంగ్రెస్ ముగింపు వేడుకల్లో కూడా జూ యే ప్రముఖంగా కనిపించడం గమనార్హం.

కీలక పదవిలో కిమ్ సోదరి..

ఇదే సమయంలో కిమ్ జోంగ్ ఉన్ తన సోదరి కిమ్ యో జోంగ్ కు పార్టీలో అత్యంత శక్తిమంతమైన ‘జనరల్ అఫైర్స్ డిపార్ట్‌మెంట్’ డైరెక్టర్ పదవిని అప్పగించారు. ఇది పార్టీ సెక్రటరీ జనరల్ పదవితో సమానమైనదని, దేశ పాలనలో ఆమె పాత్ర మరింత పెరిగిందని విశ్లేషకులు చెబుతున్నారు. మొత్తానికి కిమ్ కుటుంబం తన పట్టును మరింత బిగించుకుంటూ, నాలుగో తరగతి వారసత్వానికి గట్టి పునాదులు వేస్తోంది.



More Telugu News