KRMB: ఏపీ ప్రాజెక్టులను అడ్డుకోండి.. కేఆర్ఎంబీకి తెలంగాణ ఫిర్యాదు

KRMB Telangana complains against AP projects
  • కృష్ణా జలాలను ఏపీ ఇతర బేసిన్లకు తరలించడంపై తెలంగాణ అభ్యంతరం
  • నిబంధనలకు విరుద్ధంగా ప్రాజెక్టులు చేపడుతున్నారని కేఆర్ఎంబీకి ఫిర్యాదు
  • రూ.47,776 కోట్లతో పనులకు ఏపీ అనుమతులు ఇచ్చిందని ఆరోపణ
  • తమ ఫిర్యాదులను బోర్డు పట్టించుకోవడం లేదన్న తెలంగాణ
  • ఏపీ పునర్‌వ్యవస్థీకరణ చట్టాన్ని ఉల్లంఘిస్తున్నారని లేఖలో వెల్లడి
కృష్ణా జలాల వినియోగంపై ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య మరోసారి వివాదం రాజుకుంది. కృష్ణా బేసిన్ అవసరాలు తీర్చకుండానే ఏపీ ప్రభుత్వం నిబంధనలకు విరుద్ధంగా నీటిని ఇతర బేసిన్‌లకు తరలిస్తోందని తెలంగాణ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ చర్యలను తక్షణం అడ్డుకోవాలని కోరుతూ కృష్ణా నది యాజమాన్య బోర్డు (కేఆర్ఎంబీ) ఛైర్మన్‌కు తెలంగాణ ఈఎన్‌సీ (జనరల్) రమేశ్ బాబు లేఖ రాశారు. 

పెన్నా బేసిన్‌కు కృష్ణా జలాలను మళ్లించేందుకు ఏపీ ప్రభుత్వం రూ.47,776.50 కోట్లతో పనులకు పరిపాలనా అనుమతులు ఇవ్వడం చట్టవిరుద్ధమని తెలంగాణ తన లేఖలో పేర్కొంది. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటరీ సామర్థ్యం పెంపు, రాయలసీమ ఎత్తిపోతల పథకాలతో పాటు హంద్రీనీవా, గాలేరు-నగరి, తెలుగుగంగ వంటి ప్రాజెక్టుల సామర్థ్యాన్ని పెంచి అదనంగా 114.75 టీఎంసీల నీటిని తరలించేందుకు ఏపీ ప్రయత్నిస్తోందని ఆరోపించింది. 

ఏపీ పునర్‌వ్యవస్థీకరణ చట్టం-2014 ప్రకారం, బేసిన్‌లో కొత్త ప్రాజెక్టు చేపట్టాలంటే కేఆర్ఎంబీ, కేంద్ర జలవనరుల సంఘం (సీడబ్ల్యూసీ) అనుమతితో పాటు అపెక్స్ కౌన్సిల్ ఆమోదం తప్పనిసరి అని తెలంగాణ గుర్తుచేసింది. బచావత్ ట్రైబ్యునల్ అవార్డు ప్రకారం కూడా బేసిన్ అవసరాలు తీరాకే నీటిని మళ్లించాలని స్పష్టం చేసింది. ఈ నిబంధనలను ఏపీ ఉల్లంఘిస్తోందని ఫిర్యాదులో వివరించింది. 

ఏపీ ఉల్లంఘనలపై 2021 నుంచి తాము ఎన్నోసార్లు ఫిర్యాదు చేసినా బోర్డు స్పందించడం లేదని, అదే సమయంలో తమ ప్రాజెక్టులపై ఏపీ చేసే ఫిర్యాదులపై మాత్రం తక్షణమే స్పందిస్తోందని తెలంగాణ ఆక్షేపించింది. తాము చేపడుతున్నవి ఉమ్మడి రాష్ట్రంలో ప్రతిపాదించిన ప్రాజెక్టులేనని, కొత్తవి కావని స్పష్టం చేసింది.
KRMB
Krishna River
Telangana
Andhra Pradesh
water dispute
river management
irrigation projects
water resources
Ramesh Babu
Godavari River

More Telugu News