India vs West Indies: భారత్-వెస్టిండీస్ మ్యాచ్ వర్షం వల్ల రద్దయితే ఏం జరుగుతుంది?

India vs West Indies Match Cancelled Due To Rain What Happens
  • ఈడెన్ గార్డెన్స్‌లో భారత్-వెస్టిండీస్ మధ్య వర్చువల్ క్వార్టర్ ఫైనల్
  • గెలిచిన జట్టు నేరుగా సెమీఫైనల్‌కు!
  • వర్షంతో మ్యాచ్ రద్దయితే నెట్ రన్‌రేట్ ఆధారంగా వెస్టిండీస్ ముందంజ
  • అప్పుడు భారత్ టోర్నీ నుంచి ఔట్
  • కోల్‌కతాలో వర్ష సూచన లేకపోవడం టీమిండియాకు ఊరట
డిఫెండింగ్ ఛాంపియన్ భారత్, టీ20 ప్రపంచకప్‌లో అత్యంత కీలకమైన సమరానికి సిద్ధమైంది. ఆదివారం కోల్‌కతాలోని చారిత్రాత్మక ఈడెన్ గార్డెన్స్ వేదికగా వెస్టిండీస్‌తో వర్చువల్ క్వార్టర్ ఫైనల్ ఆడనుంది. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు నేరుగా సెమీ ఫైనల్‌కు అర్హత సాధిస్తుంది. గ్రూప్-A నుంచి ఇప్పటికే దక్షిణాఫ్రికా సెమీస్ బెర్త్‌ను ఖాయం చేసుకోగా, రెండో స్థానం కోసం ఈ రెండు జట్లు తలపడనున్నాయి. దీంతో ఈ మ్యాచ్‌పై సర్వత్రా తీవ్ర ఉత్కంఠ నెలకొంది.

అయితే, ఈ మ్యాచ్ ఫలితం కన్నా వాతావరణమే భారత జట్టును, అభిమానులను ఎక్కువగా ఆందోళనకు గురిచేస్తోంది. ఒకవేళ వర్షం లేదా ఇతర కారణాలతో మ్యాచ్ రద్దయితే, ఇరు జట్లకు చెరో పాయింట్ కేటాయిస్తారు. ఈ మ్యాచ్‌కు రిజర్వ్ డే సౌకర్యం కూడా లేదు. అలాంటప్పుడు రెండు జట్ల పాయింట్లు సమానమవుతాయి. నిబంధనల ప్రకారం, అప్పుడు నెట్ రన్‌రేట్ ఆధారంగా సెమీస్ బెర్త్‌ను నిర్ణయిస్తారు. ఈ సమీకరణంలో వెస్టిండీస్ స్పష్టమైన ఆధిక్యంలో ఉంది. విండీస్ నెట్ రన్‌రేట్ +1.791 ఉండగా, భారత్ రన్‌రేట్ -0.100గా ఉంది. కాబట్టి, మ్యాచ్ రద్దయితే మెరుగైన రన్‌రేట్ కారణంగా వెస్టిండీస్ ముందంజ వేసి సెమీస్‌కు చేరుకుంటుంది, ఆతిథ్య జట్టు భారత్ టోర్నీ నుంచి నిష్క్రమించాల్సి వస్తుంది. ఈ నేపథ్యంలో, టీమిండియా ఈ మ్యాచ్‌లో కచ్చితంగా గెలవాల్సిన పరిస్థితి ఏర్పడింది.

అయితే, అభిమానులకు ఊరటనిచ్చే విషయం ఏమిటంటే, ఆదివారం కోల్‌కతాలో వర్షం పడే సూచనలు లేవని వాతావరణ శాఖ నివేదికలు చెబుతున్నాయి. పగటిపూట ఉష్ణోగ్రత 34 డిగ్రీల సెల్సియస్ వరకు చేరినా, మ్యాచ్ ప్రారంభమయ్యే సమయానికి 25-26 డిగ్రీలకు పడిపోయి వాతావరణం ఆహ్లాదకరంగా మారుతుందని అంచనా.

గురువారం చెన్నైలోని చెపాక్ స్టేడియంలో జింబాబ్వేతో జరిగిన తమ రెండో సూపర్ 8 మ్యాచ్‌లో భారత్ 72 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించి ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగుతోంది. దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి మ్యాచ్‌లో ఓడిన భారత్, ప్రస్తుతం రెండు పాయింట్లతో ఉంది. మరోవైపు, వెస్టిండీస్ తన చివరి మ్యాచ్‌లో టీ20 ప్రపంచకప్ 2024 రన్నరప్ అయిన దక్షిణాఫ్రికా చేతిలో 9 వికెట్ల తేడాతో భారీ ఓటమిని చవిచూసింది. అంతకుముందు జింబాబ్వేపై గెలిచిన కరీబియన్ జట్టు ఖాతాలో కూడా రెండు పాయింట్లే ఉన్నాయి. దీంతో ఈ డూ-ఆర్-డై పోరులో గెలుపు ఎవరిని వరిస్తుందోనని క్రికెట్ ప్రపంచం ఆసక్తిగా ఎదురుచూస్తోంది.
India vs West Indies
T20 World Cup
India
West Indies
Kolkata
Net Run Rate
Semi Finals
Eden Gardens

More Telugu News