Vijay: విజయ్‌కి అభిమానిగా పరిచయమై... ఇప్పుడు విడాకులకు దరఖాస్తు... సంగీత ప్రస్థానం ఇదిగో!

Vijays Wife Sangeetha Files for Divorce What Happened
  • తమిళ మూలాలు ఉన్న శ్రీలంక యువతి సంగీత సోర్నలింగం
  • యూకేలో స్థిరపడిన శ్రీలంక వ్యాపారి కూతురు సంగీత
  • అభిమానిగా పరిచయమై ప్రేమ, పెళ్లి దారి తీసిన వైనం
  • కుమారుడిని పెళ్లి చేసుకోమని సంగీతను అడిగిన విజయ్ తల్లిదండ్రులు
  • 1999లో హిందూ వివాహ పద్ధతిలో పెళ్లి
టీవీకే పార్టీ అధినేత, తమిళ నటుడు విజయ్ భార్య సంగీత చెంగల్‌పట్టు కోర్టులో విడాకుల కోసం దరఖాస్తు చేసుకున్నారు. విజయ్‌కి ఉన్న వివాహేతర సంబంధం కారణంగా విడాకులు కోరుతున్నట్లు ఆమె తన పిటిషన్‌లో పేర్కొన్నట్లు వార్తలు వచ్చాయి.

సంగీతకు శ్రీలంకలోని తమిళ మూలాలు ఉన్నాయి. యూకేలో పుట్టి పెరిగిన ఆమెకు 1999లో విజయ్‌తో వివాహం జరిగింది. ఆమె శ్రీలంకకు చెందిన ఒక తమిళ వ్యాపారి కూతురు. ఆమె తండ్రి యూకేలో స్థిరపడ్డారు.

ఆసక్తికర విషయమేమంటే విజయ్‌ని సంగీత మొదట ఆయన అభిమానిగా కలిసింది. ఆ కలయిక ఆ తర్వాత ప్రేమగా మారింది. విజయ్ చెన్నై ఫిల్మ్ సిటీలో ఓ చిత్రం షూటింగ్‌లో ఉన్నారు. ఆ సమయంలో లండన్ నుంచి వచ్చిన సంగీత అతనిని కలిసి 'పూవే ఉనక్కాగ' చిత్రం విజయవంతం కావడం పట్ల అభినందనలు తెలియజేశారు.

ఆమె పట్ల ముగ్ధుడైన విజయ్ తన ఇంటికి తీసుకువెళ్లి తన తల్లిదండ్రులకు పరిచయం చేశారు. విజయ్‌తో అభిమానిగా ఇక్కడ మొదలైన సంగీత ప్రయాణం కొన్నాళ్లకు ప్రేమగా మారింది. అమె చెన్నై వచ్చినప్పుడల్లా దగ్గరలోనే ఉంటూ విజయ్ కుటుంబాన్ని కలిసేవారు. వారి మధ్య ప్రేమను గుర్తించిన విజయ్ తల్లిదండ్రులు చంద్రశేఖర్, శోభ చొరవ తీసుకుని, సంగీతను వివాహం గురించి అడిగారు. మా కుమారుడు విజయ్‌ని వివాహం చేసుకుంటావా అని తల్లిదండ్రులు అడగగా, ఆమె అంగీకరించారు.

ఆ తర్వాత విజయ్ తల్లిదండ్రులు సంగీత తల్లిదండ్రులను కలవడానికి లండన్ వెళ్లారు. రెండు కుటుంబాల ఆమోదంతో 1999 ఆగస్టు 25న వీరి వివాహం జరిగింది. విజయ్ క్రైస్తవుడు, సంగీత హిందువు. దీంతో పెళ్లి హిందూ వివాహ పద్ధతిలో చేసుకుని, ఆ తర్వాత చెన్నైలో రిసెప్షన్ జరుపుకున్నారు.

వీరికి ఇద్దరు సంతానం. 2000 సంవత్సరంలో మొదటి బిడ్డకు, 2005లో రెండో బిడ్డకు సంగీత జన్మనిచ్చారు. వారి పిల్లలు కూడా విజయ్‌తో కలిసి వెట్టైకారన్, తేరి చిత్రాలలో తెరపై కాసేపు కనిపించారు. విజయ్, సంగీత ప్రైవేటు జీవితం ఇప్పటి వరకు ఎప్పుడూ పెద్దగా బయటకు రాలేదు. రెండున్నర దశాబ్దాల తర్వాత ఇప్పుడు సంగీత విడాకుల కోసం దరఖాస్తు చేసుకున్నారు.
Vijay
Sangeetha
Tamil actor Vijay
Sangeetha divorce
Tamil Nadu
Kollywood
Sangeetha Soralingam

More Telugu News