వైవీ సుబ్బారెడ్డి భారీగా సంపాదించారు: బాలినేని శ్రీనివాసరెడ్డి
- లడ్డూ వ్యవహారంలో సుబ్బారెడ్డి ఎంత సంపాదించారో తనకు తెలియదన్న బాలినేని
- సుబ్బారెడ్డిని అరెస్ట్ చేస్తే ఎక్కువ సంతోషించే వ్యక్తి తానేనని వ్యాఖ్య
- తన కుమారుడిని వివాదాల్లోకి లాగుతున్నారని ఆవేదన
టీటీడీ మాజీ చైర్మన్, వైసీపీ రాజ్యసభ సభ్యుడు వైవీ సుబ్బారెడ్డిపై మాజీ మంత్రి, జనసేన నేత బాలినేని శ్రీనివాసరెడ్డి సంచలన వ్యాఖ్యలుచేశారు. తిరుమల లడ్డూ వ్యవహారంలో వైవీ సుబ్బారెడ్డి ఎంత సంపాదించారో తనకు తెలియదు కానీ, ఇతర అంశాల్లో మాత్రం భారీగా వెనకేశారని బాలినేని ఆరోపించారు. వైవీ సుబ్బారెడ్డిని పోలీసులు అరెస్ట్ చేసి జైల్లో వేస్తే, అందరికంటే ఎక్కువగా సంతోషించే మొదటి వ్యక్తిని తానే అని అన్నారు.
తనపై వచ్చిన ఆరోపణలపై నిష్పక్షపాతంగా విచారణ జరపాలని ముఖ్యమంత్రి చంద్రబాబును కోరినట్లు వెల్లడించారు. తన రాజకీయ ప్రత్యర్థులు తన కుమారుడిని వివాదాల్లోకి లాగుతూ తనను మానసిక క్షోభకు గురిచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తాను ఒంగోలులో రెండుసార్లు ఓడిపోవడానికి కూటమి బలంగా ఉండటమే కారణమని విశ్లేషించారు. గత ప్రభుత్వ హయాంలో డ్వాక్రా మహిళల నగదును కాజేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని బాలినేని డిమాండ్ చేశారు. ఆ నిధులు కాజేసిన వైసీపీ నేతల పేర్లను బయటపెట్టి, వారిపై విచారణ జరిపించాలని కోరారు.