రణ్‌వీర్ సింగ్‌పై నిషేధం.. తీవ్రంగా స్పందించిన రామ్ గోపాల్ వర్మ

Ram Gopal Varma Reacts Strongly to Ranveer Singh Ban
  • రణ్‌వీర్ సింగ్‌పై మూడేళ్ల నిషేధం విధించిన ఫెడరేషన్ ఆఫ్ వెస్ట్రన్ ఇండియా సినీ ఎంప్లాయీస్ 
  • ఈ ఫెడరేషన్ అనేది ఎలాంటి కోర్టు లేదా ప్రభుత్వ నియంత్రణ సంస్థ కాదన్న వర్మ
  • రణ్‌వీర్ గ్రీన్ సిగ్నల్ ఇస్తే కిలోమీటర్ పొడవున నిర్మాతలు క్యూ కడతారని వ్యాఖ్య

బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌వీర్ సింగ్‌పై ఫెడరేషన్ ఆఫ్ వెస్ట్రన్ ఇండియా సినీ ఎంప్లాయీస్ (FWICE) మూడేళ్ల పాటు నిషేధం విధించడం దేశవ్యాప్తంగా సినీ, రాజకీయ వర్గాల్లో తీవ్ర సంచలనంగా మారింది. ప్రతిష్టాత్మక 'డాన్-3' సినిమా నుండి రణ్‌వీర్ తప్పుకోవడం వల్ల నిర్మాతలకు కోట్లలో నష్టం వాటిల్లిందనే కారణంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ వివాదంపై సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తనదైన శైలిలో స్పందిస్తూ రణ్‌వీర్ సింగ్‌కు పూర్తి మద్దతు ప్రకటించారు.


ఎక్స్ వేదికగా ఆర్జీవీ సినీ ఎంప్లాయీస్ యూనియన్ వ్యవస్థపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. "రణ్‌వీర్‌ను కాదు.. ముందు FWICE ని బ్యాన్ చేయాలి" అంటూ ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ సినీ యూనియన్ వ్యవస్థ చాలా పాతబడిపోయిందని, పరిశ్రమలో తమ పట్టును కోల్పోకుండా ఉండటానికే ఇటువంటి డ్రామాలు ఆడుతున్నారని మండిపడ్డారు. ఇది కార్మికుల రక్షణ కోసం చేస్తున్న పని కాదని కొట్టిపారేశారు.

ఈ ఫెడరేషన్ అనేది ఎలాంటి కోర్టు లేదా ప్రభుత్వ నియంత్రణ సంస్థ కాదు.. ఇదొక ‘కంగారూ కోర్ట్’ లాంటిదని ఆర్జీవీ అభివర్ణించారు. రణ్‌వీర్ సాధిస్తున్న భారీ విజయాలను చూసి ఓర్వలేక, కొంతమంది ఒక అజెండాతో ఈ నిర్ణయం తీసుకున్నారని ఆరోపించారు. రణ్‌వీర్ వల్ల ఐదు లక్షల మంది కార్మికుల పొట్ట కొట్టారనడం పెద్ద అబద్ధమని, ఇండస్ట్రీలో కార్మికుల జీవనోపాధి ఎప్పుడూ ఒక్క నటుడిపైనో లేదా ఒక్క ప్రాజెక్ట్ పైనో ఆధారపడి ఉండదన్నారు. ఇది కేవలం ఒక నిర్మాతకు, హీరోకు మధ్య ఉన్న ప్రైవేట్ కాంట్రాక్ట్ వివాదమని, దీనిని సివిల్ కోర్టులు చూసుకుంటాయని స్పష్టం చేశారు.

"థియేటర్లలో టిక్కెట్లు అమ్మేది రణ్‌వీర్ సింగ్ లాంటి స్టార్స్ మాత్రమే, ఫెడరేషన్ కాదు. రణ్‌వీర్ లాంటి స్టార్స్ వల్లే లక్షలాది మంది కార్మికులకు ఉపాధి దొరుకుతోంది. వారు ఉన్నారు కాబట్టే ఇండస్ట్రీ ఉంది, ఈ ఫెడరేషన్ కూడా ఉంది. రణ్‌వీర్ గ్రీన్ సిగ్నల్ ఇస్తే ఆయన ఇంటి ముందు రేపు పొద్దున్నే ఒక కిలోమీటర్ పొడవున నిర్మాతలు బ్లాంక్ చెక్కులతో క్యూ కడతారు. కాబట్టి ఇద్దరి మధ్య ఉన్న సివిల్ వివాదంలోకి వేలు పెట్టకండి" అని ఆర్జీవీ హితవు పలికారు.

గతంలో షారుఖ్ ఖాన్ నటించిన ‘డాన్’, ‘డాన్ 2’ చిత్రాల తర్వాత, 2023లో ఫర్హాన్ అక్తర్ దర్శకత్వంలో రణ్‌వీర్ సింగ్‌తో ‘డాన్ 3’ ప్రకటించారు. కానీ ఇప్పుడు తలెత్తిన వివాదాల వల్ల రణ్‌వీర్ దీని నుండి తప్పుకోవడంతో బాలీవుడ్‌లో సరికొత్త చర్చకు దారితీసింది.

Go Back to Shorts
Ram Gopal Varma
Ranveer Singh
FWICE
Don 3
Bollywood ban
Ram Gopal Varma comments
Farhan Akhtar
Shah Rukh Khan
movie industry
film employees union

More Telugu News