ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో స్పీకర్‌ను కలిసిన మల్లు భట్టివిక్రమార్క, శ్రీధర్ బాబు

  • మర్యాదపూర్వకంగా సభాపతిని కలిసిన తెలంగాణ మంత్రులు
  • మార్చి 5న జరగనున్న కుమారుడి వివాహానికి ఆహ్వానించిన భట్టివిక్రమార్క
  • అంతకుముందు, కనకదుర్గమ్మను దర్శించుకున్న భట్టివిక్రమార్క
ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ అయ్యన్నపాత్రుడిని తెలంగాణ రాష్ట్ర ఉపముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క, తెలంగాణ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు మర్యాదపూర్వకంగా కలిశారు. వీరు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో అయ్యన్నపాత్రుడిని కలిశారు. ఈ సందర్భంగా తన కుమారుడు సూర్యవిక్రమాదిత్య వివాహానికి రావాల్సిందిగా భట్టి ఆహ్వాన పత్రిక అందజేశారు. అనంతరం వారు కాసేపు ముచ్చటించుకున్నారు. కాగా, మార్చి 5వ తేదీన హైదరాబాద్‌లో భట్టివిక్రమార్క తనయుడి వివాహం జరగనుంది.

అంతకుముందు, ఆయన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసి వివాహ ఆహ్వాన పత్రికను అందజేశారు. ఉదయం మల్లు భట్టివిక్రమార్క బెజవాడ కనకదుర్గమ్మ తల్లిని దర్శించుకున్నారు. ఆలయ అసిస్టెంట్ కమిషనర్ రంగారావు, అర్చకులు ఆయనకు ఘనస్వాగతం పలికారు. దర్శనం అనంతరం భట్టివిక్రమార్కకు పండితులు వేదాశీర్వచనం అందించారు. అమ్మవారి ప్రసాదం, చిత్రపటాన్ని అందజేశారు.


More Telugu News