Donald Trump: ట్రంప్ ఆందోళనను తోసిపుచ్చిన నిఘా వర్గాలు

US Intelligence Disagrees with Trump on Iran Missile Threat
  • ఇరాన్ క్షిపణులు అమెరికాను తాకుతాయన్న ట్రంప్
  • 2035 లోనే అది సాధ్యమవుతుందని చెప్పిన ఇంటెలిజెన్స్
  • తమ క్షిపణుల పరిధి కేవలం 2 వేల కి.మీ మాత్రమేనన్న ఇరాన్ విదేశాంగ మంత్రి
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ‘స్టేట్ ఆఫ్ ది యూనియన్ స్పీచ్’ లో ఇరాన్ క్షిపణి సామర్థ్యంపై చేసిన వ్యాఖ్యలు అంతర్జాతీయ స్థాయిలో పెద్ద చర్చకు దారితీశాయి. ఇరాన్ అభివృద్ధి చేస్తున్న అత్యాధునిక క్షిపణులు త్వరలోనే అమెరికా గడ్డను తాకే ప్రమాదం ఉందని కాంగ్రెస్ ను ట్రంప్ హెచ్చరించారు. అయితే, ఈ విషయంలో అధ్యక్షుడి మాటలను అమెరికా సొంత నిఘా సంస్థలే తోసిపుచ్చాయి. ఇరాన్ కు అంత సామర్థ్యంలేదని, ఇప్పట్లో అది సాధ్యం కాదని చెప్పాయి. దీంతో వైట్ హౌస్ లో భేదాభిప్రాయాలు ముదిరాయి.

నిఘా సంస్థల అంచనా ఇదే..
డిఫెన్స్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ (డీఐఏ) నివేదికల ప్రకారం.. ఒక పూర్తిస్థాయి ఖండాంతర క్షిపణిని తయారు చేయడానికి ఇరాన్ కు 2035 వరకు సమయం పడుతుంది. ఒకవేళ చైనా లేదా ఉత్తర కొరియా వంటి దేశాలు సాంకేతిక సాయం అందించినా సరే కనీసం ఎనిమిదేళ్ల వరకు ఇరాన్ అమెరికాను తాకగలిగే క్షిపణిని సిద్ధం చేయలేదని మూడు ఇంటెలిజెన్స్ వర్గాలు ధ్రువీకరించాయి. ట్రంప్ తన వాదనను అతిశయోక్తిగా చెబుతున్నారని రక్షణ రంగ నిపుణులు విశ్లేషిస్తున్నారు.

ఇరాన్ విదేశాంగ మంత్రి ఏమన్నారంటే..
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆరోపణలను ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ కొట్టిపారేశారు. తాము ఉద్దేశపూర్వకంగానే తమ క్షిపణుల పరిధిని 2000 కిలోమీటర్లకు పరిమితం చేశామని, ఇది కేవలం ప్రాంతీయ రక్షణ కోసమేనని ఆయన స్పష్టం చేశారు. అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో స్పందిస్తూ.. ఇరాన్ అటువంటి సామర్థ్యాల దిశగా అడుగులు వేస్తోందని వ్యాఖ్యానించారు.
Donald Trump
Iran
missile capability
US intelligence
State of the Union
Abbas Araghchi
Marco Rubio
Defense Intelligence Agency

More Telugu News