Delhi Police: పోలీస్ వార్: ఢిల్లీ పోలీసులపై హిమాచల్ పోలీసుల కిడ్నాప్ కేసు!

Delhi Police Face Kidnapping Case Filed by Himachal Police
  • ఢిల్లీ, హిమాచల్ పోలీసుల మధ్య తీవ్ర వివాదం
  • సమాచారం లేకుండా అరెస్టులు చేయడమే కారణం
  • యువ కాంగ్రెస్ నేతల అరెస్ట్‌తో మొదలైన చిచ్చు
  • వివాదానికి రాజకీయ రంగు పులుముకోవడంపై చర్చ
శాంతి భద్రతలు కాపాడాల్సిన పోలీసులే ఒకరిపై ఒకరు కేసులు పెట్టుకోవడం దేశవ్యాప్తంగా సంచలనం రేపుతోంది. ఢిల్లీ పోలీసులకు, హిమాచల్ ప్రదేశ్‌లోని సిమ్లా పోలీసులకు మధ్య మొదలైన వివాదం ఇప్పుడు కిడ్నాప్ కేసు వరకు దారితీసింది. తమ రాష్ట్రంలోకి ముందస్తు సమాచారం లేకుండా ప్రవేశించి అరెస్టులు చేశారన్న ఆరోపణలతో సిమ్లా పోలీసులు ఏకంగా ఢిల్లీ పోలీసులపై కిడ్నాప్ కేసు నమోదు చేశారు.

ఇటీవల ఢిల్లీలో జరిగిన 'ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్'లో ముగ్గురు యువ కాంగ్రెస్ నాయకులు చొక్కాలు విప్పి నిరసన తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు, నిందితులను పట్టుకునేందుకు హిమాచల్ ప్రదేశ్‌కు వెళ్లారు. అక్కడ ఆ ముగ్గురు యువ కాంగ్రెస్ నేతలను అదుపులోకి తీసుకుని ఢిల్లీకి తరలించారు.

అయితే, ఒక రాష్ట్ర పోలీసులు మరో రాష్ట్రంలో అరెస్టులు చేసేటప్పుడు స్థానిక పోలీసులకు ముందస్తు సమాచారం ఇవ్వాలన్న నిబంధనను ఢిల్లీ పోలీసులు పాటించలేదని సిమ్లా పోలీసులు ఆరోపిస్తున్నారు. తమకు చెప్పకుండా అరెస్టుల పేరుతో వ్యక్తులను తీసుకెళ్లడం కిడ్నాప్ కిందకే వస్తుందని భావించి, ఢిల్లీ పోలీసు అధికారులపై కిడ్నాప్ కేసు నమోదు చేశారు. ఈ చర్య జాతీయ స్థాయిలో పోలీసు వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. హిమాచల్‌లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉండటం, ఢిల్లీ పోలీసులు కేంద్ర ప్రభుత్వ పరిధిలో పనిచేస్తుండటంతో ఈ వివాదం రాజకీయ రంగు పులుముకుంది.  
Delhi Police
Himachal Police
Kidnapping Case
Shimla Police
AI Impact Summit
Youth Congress Leaders
Arrest Controversy
Inter-state Police Dispute

More Telugu News